ఈ జగత్తులో డబ్బుంటే చాలు ఇంకేం వద్దు అని అనుకునే మనుషులున్నారు. అలాంటి మనుషుల మధ్యలో ఓ మహిళ తన ఆత్మగౌరవం కోసం పోరాడింది. తనను తాను నిరూపించుకునేందుకు ఒంటరితనం అనే గోడలు బద్దలు కొట్టుకొని తాను
కోరుకున్న ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసే బొమ్మలు తయారు చేస్తూ
పదిమందికి ఉపాధి కల్పిస్తున్నది ‘మనోవాంఛ’ వ్యవస్థాపకురాలు సింధు శ్రీరామ్. అంచెలంచెలుగా ఎదిగి మహిళా సాధికారతకు నిర్వచనం చెబుతున్న సింధు జిందగీతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
గొప్ప ప్రయత్నాలన్నీ హేళనలతోనే ప్రారంభం అవుతాయన్నదానికి నా ప్రయాణమే ఒక ఉదాహరణ. నా అనుకున్న వాళ్లే ఒకానొక సందర్భంలో డబ్బును నా ముఖాన కొట్టారు. ఆ అవమానం నుంచి పుట్టిందే ఈ ‘మనోవాంఛ’. మాది కోదాడ. పదోతరగతి వరకు ఊర్లోనే చదువుకున్న నేను పై చదువుల కోసం హైదరాబాద్‌కి వచ్చాను. నాకు చిన్నప్పటినుంచే బొమ్మలు వేయడం అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే డిగ్రీలో ఫైన్ ఆర్ట్స్ చదివాను. భవిష్యత్తులో కచ్చితంగా ఈ రంగంలో రాణించాలని భావించాను. నేను స్థాపించాలనుకున్న సంస్థకు చిన్నప్పుడే నిర్ణయించుకున్న ‘మనోవాంఛ’ అన్న పేరును ఖరారు చేశాను. ఆ పేరును అప్పట్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.

కానీ, అనుకోకుండా డిగ్రీ చివరి సంవత్సరంలో ప్లేస్మెంట్లో ఉద్యోగం రావడంతో ఇష్టం లేకున్నా రెండేండ్లపాటు ఉద్యోగం చేశాను. ఆ తరువాత పెళ్లి చేసుకొని గృహిణిగా స్థిరపడ్డాను. నచ్చిన పనిచేయాలనే ఆలోచన ఉన్నా దాన్ని ఎలా మొదలు పెట్టాలనేది అర్థం కాలేదు. మా వారిది రాజకీయ కుటుంబం కావడంతో ఇంట్లో ఎవరూ ఉండేవాళ్లు కాదు. నేను ఒక్కదాన్నే ఒంటరిగా రోజంతా గడిపేదాన్ని. ఒకరోజు మాకు అవసరం ఉందని తెలిసి డబ్బు ఇవ్వడానికి మా ఆత్మీయులు ఇంటికి వచ్చారు. మావారి మీద కోపాన్ని నా మీద చూపించారు. ఆ డబ్బులను నా ముఖాన కొట్టారు. ఆ సంఘటనతో చాలా బాధపడ్డాను. ఆత్మగౌరవంతో జీవించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. నాకు ఇష్టమైన ఫైన్ ఆర్ట్స్‌నే వృత్తిగా ఎంచుకున్నాను. కొంతమంది పిల్లలకు వర్క్‌షాప్‌లు నిర్వహించడం ప్రారంభించాను. ఆ తరువాత ఇంట్లో ఒక్కదాన్నే గడ్డితో చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేయడం మొదలు పెట్టాను.
పరిచయస్తులకు నేను తయారుచేసిన గిప్ట్ ఆర్టికల్స్ చూపించేదాన్ని. హైదరాబాద్‌లో ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా స్టాల్ ఏర్పాటు చేసేదాన్ని. ప్రారంభంలో కాస్త అయోమంగానే ఉన్నా క్రమంగా ఒక్కొక్కటీ అమ్ముడుపోయాయి. కొన్నిరోజులకు ఆర్డర్లు పెరగడంతో మరో అమ్మాయిని సహాయంగా పెట్టుకున్నాను. చాలామంది దివ్యాంగులను చూసి జాలి పడుతుంటారు. నాకు మాత్రం వాళ్లకు ఉపాధి కల్పించాలనే ఆలోచన మొదలైంది. నా వ్యాపారం కూడా మెరుగుపడటంతో కొంతమందికి ఉపాధి కల్పించాను. ఆర్డర్లు పెరిగి వ్యాపారం కుదురుకుంటుందన్న సమయంలోనే కరోనా మొదలైంది. కొన్నికారణాల వల్ల మొత్తం సిబ్బందిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తరువాత నెమ్మదిగా వ్యాపారం తిరిగి పుంజుకున్నది. చేసే పని వినూత్నంగా ఉండాలనే ఆలోచన నాది. అందులో భాగంగానే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాను. నాలుగేండ్ల క్రితం ఓ శారీ ఫంక్షన్‌కు సాధారణ గిఫ్ట్‌లా కాకుండా ఆ పండుగ విశిష్టతను తెలిపేలా డెకరెట్ చేసి ఇచ్చాను.

అక్కడికొచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. తర్వాత కూడా ఇంకా కొత్త కాన్సెప్ట్‌లు డిజైన్ చేస్తూనే ఉన్నాను. ఏ ప్రయత్నం చేసినా అందులో మన సంప్రదాయాలను కచ్చితంగా చేర్చుతాను. ఆ పండుగల విశిష్ఠతను వివరిస్తాను. ప్రారంభంలో గడ్డి, జ్యూట్, కలపతో బుట్టలు, చీరలు పెట్టేందుకు తాంబాలం లాంటి పాత్ర తయారు చేసేదాన్ని. ప్రస్తుతం అదనంగా సిల్వర్, మెటల్‌ను ఉపయోగించి 400కుపైగా రకరకాల గిప్ట్ ఐటెమ్స్ తయారు చేస్తున్నాం.
గత అనుభవాల దృష్ట్యా.. ఈ వ్యాపారం మొదలు పెట్టేందుకు ఎవరి సహాయమూ తీసుకోవద్దని భావించాను. బ్యాంకు నుంచి రూ.50 లక్షల వరకు రుణం తీసుకోని ప్రారంభించాను. అందులో సగానికి పైగా తీర్చేశాను. ఇంకా సగమున్నా తీర్చుతాననే ధైర్యముంది. ఒకసారి అమెరికాకు కొరియర్ పంపించే విషయంలో షిప్పింగ్‌లో తేడా వచ్చింది. కస్టమర్ వాగ్వాదానికి దిగడంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఈ ప్రయాణంలో అలాంటి ఒడుదొడుకులు అనేకం ఎదురయ్యాయి. మొదట్లో అమ్మిన లాభాన్ని దాచుకోకుండా మరో వస్తువు తయారు చేసేందుకు పెట్టుబడి పెట్టేదాన్ని.

పది రూపాయల నుంచి మొదలైన నా వ్యాపారం నేడు అభివృద్ధిలో సాగుతుంది. దానికి కారణం నా కష్టమే అని గర్వంగా చెబుతాను. ప్రస్తుతం పదిహేను మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఆర్డర్లు ఎక్కువగా వస్తే గతంలో నేను శిక్షణనిచ్చిన వారితో ఆ ఐటెమ్స్ తయారు చేయించుకొని వారికి డబ్బులు చెల్లిస్తుంటాను. ఇంటినుంచి మొదలైన నా ప్రయాణం ప్రస్తుతం గ్లోబల్‌కు చేరింది. నా గిఫ్ట్ ఆర్టికల్స్‌ను ప్రపంచ దేశాల్లో ఆదరిస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించాలన్నదే నా లక్ష్యం.
-రాజు పిల్లనగోయిన