ముంబై, డిసెంబర్ 28: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు ప్రతిరోజూ పుస్తకాలు చదవడం అలవాటు. ఆఖరుకు భోజన విరామ సమయంలోనూ ఆయన పుస్తకాల వేటలోనే ఉండేవారు. పుస్తకాల కోసం ఆయన ఎంతలా ఆసక్తి కనబరిచేవారో ముంబైలోని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రం స్ట్రాండ్ బుక్ స్టాల్ సిబ్బంది గుర్తు చేసుకున్నారు. 1982 నుంచి 1985 మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా మన్మోహన్ సింగ్ పని చేశారు. ఈ సమయంలో ఆయన తరచూ ఫోర్ట్ ఏరియాలోని స్ట్రాండ్ బుక్ స్టాల్కు వెళ్లేవారు. ఎక్కువగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆయన తమ దుకాణానికి వచ్చే వారని అప్పట్లో అందులో పని చేసిన జగత్ అనే వ్యక్తి చెప్పారు. సూట్ లేదా కుర్తా పైజామా ధరించి వచ్చేవారని, చాలా సున్నితంగా మాట్లాడేవారని, నిరాడంబరంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఎక్కువగా మేనేజ్మెంట్, ఫైనాన్స్, ఆర్థిక శాస్ర్తానికి సంబంధించిన పుస్తకాలను మన్మోహన్ సింగ్ అడిగేవారని చెప్పారు.