సజీవ సాహిత్య ప్రవాహం మంజీరా రచయితల సంఘం
‘మానవత భావుకత..
మా వస్తు శిల్పాలు
జీవితపు విలువలే..
మా అలంకారాలు
సమభావ సంస్కృతులే..
మా రమ్యహార్మ్యాలు’
అనే స్పష్టమైన సామాజిక దిశానిర్దేశంతో..కవితగా, కథగా, పాటగా, సమాజ గమనానికి బాటగా ముందు కు సాగుతున్న సజీవ సాహిత్య స్రవంతి ‘మంజీరా రచయితల సంఘం’ (మరసం). నాలుగు దశాబ్దాలుగా ప్రజాస్వామిక ఉద్యమాలకు పెన్నుదన్నుగా నిలుస్తూ, ఈ వేదిక ద్వారా ఎందరో సాహిత్యకారులు సృష్టించిన సృజన సమాజంపై చెరగని ముద్ర వేసింది. ‘మరసం’ వెలుగులో వికసించిన వచన కవిత్వం, కథలు, నవలలు, విమర్శనా వ్యాసాలు, పరిశోధనా గ్రంథాలు, చరిత్ర రచనలే దీనికి సజీవ నిదర్శనాలు.
కేవలం సాహిత్య సృజనకే పరిమితం కాకుండా, సమాజంలో సంభవించిన ప్రతి చలనంలోనూ, ప్రజా ఉద్యమాల్లోనూ ‘మరసం’ బాధ్యతాయుతమైన పాత్ర పోషించింది. దళిత, స్త్రీవాద, అస్తిత్వ, మైనారిటీ, బహుజన దృక్పథాలకు సంఘీభావంగా నిలుస్తూ స్పష్టమైన అవగాహనతో కృషి చేసింది. అణచివేతకు, అసమానతలకు గురవుతున్న వర్గాల హక్కుల కోసం, శ్రమజీవుల స్వేదానికి తగిన ఫలం దక్కాలని గళమెత్తింది; కలం ఝళిపించింది.
పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు దక్కాలనే హక్కుల పరిరక్షణకు కట్టుబడి నిలిచిన ‘మరసం’..సమాజంలోని అనేక రుగ్మతలపై సాంస్కృతిక యుద్ధాన్ని ప్రకటించింది. వరకట్నం, మూఢనమ్మకాలు, బాణామతి, అశ్లీల సాహిత్యం, మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా నిత్య నిర్బంధ వాతావరణంలోనూ తెగువతో నిలబడి వందలాది ప్రదర్శనలిచ్చింది. విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలను కాపాడటానికి తన రచనల ద్వారా నిరంతరాయంగా శ్రమించింది.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో మంజీరా రచయితల సంఘం అత్యంత బలమైన సాంస్కృతిక ప్రాతిపదికను నిర్మించింది. 1996లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ప్రజాస్వామికమైనదని నినదిస్తూ, ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రజల్లో చైతన్యాన్ని రగిలించింది. తెలంగాణ భావన అంకురిస్తున్న తొలి అడుగుల్లోనే ‘మరసం’, ఉద్యమ వాహికలుగా అనేక పాటలను అందించింది.
‘మరసం’ వ్యవస్థాపకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి రాసిన ‘నాగేటి చాల్లల్ల నా తెలంగాణ’ పాట, తెలంగాణ సాంస్కృతిక పతాకమై రెపరెపలాడింది. ‘తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి‘, ‘జోహారులూ..జోహారులూ..అమరులకు జోహార్’ వంటి పాటలు జాతి తలపుల్లో నిలిచిపోయాయి. దాసరాజు రామారావు తదితర కవులు సృష్టించిన గీతాలు తెలంగాణ ఉద్యమానికి తొలి నిప్పు కణాల్ని రాజేశాయి.
‘మరసం’ ప్రేరణతో ఎదిగిన దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, షేక్ బాబా వంటి కవి గాయకుల గళాలు తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించాయి. తెలంగాణ ఉద్యోగుల పోరాటానికి దిక్సూచిగా నిలిచిన దేవీప్రసాద్ ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు కాగా.. పాత్రికేయుడి నుంచి శాసనసభ్యుడిగా ఎదిగిన అమరుడు సోలిపేట రామలింగారెడ్డి, జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ వంటి ఎందరో ప్రముఖుల ఎదుగుదలకు ‘మరసం’ ప్రేరణగా నిలిచింది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న సాహిత్యకారులను ఏకం చేసి, ఒక ఉమ్మడి వేదిక ఆవిర్భావానికి ‘మరసం’ బలమైన భూమికను పోషించింది.
1986 జూలైలో పురుడు పోసుకున్న మంజీరా రచయితల సంఘం.. దాశరథి, కాళోజీ, ఆరుద్ర, రావూరి భరద్వాజ, సినారె, వరవరరావు, హరగోపాల్ వంటి మహామహులు మొదలుకుని వర్తమాన సాహిత్యకారుల వరకు ఎందరినో ఒకే వేదికపైకి ఆహ్వానించి బృహత్ సాహిత్య సభలను నిర్వహించింది. తద్వారా ప్రజాస్వామిక సాహిత్య చైతన్యాన్ని బలోపేతం చేసింది. ఇప్పటివరకు ‘మరసం’ సుమారు 60 పుస్తకాలను ప్రచురించి సాహిత్య క్షేత్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది.
ఈ ప్రస్థానంలో దివంగత ఏలేశ్వరం నాగభూషణాచార్య, అలాజ్పూర్ కిషన్, కె. అంజయ్య, మోతుకూరి అశోక్ కుమార్, అహ్మద్, పప్పుల రాజిరెడ్డి, పోగుల రాజన్న, ఐలేని గిరి, మహమూద్ పాషా, తైదల అంజయ్య, వేముగంటి మురళి, సిద్దెంకి యాదగిరి, పొన్నాల బాలయ్య, కె. రంగాచారి, నందిని భగవాన్ రెడ్డి, తోట అశోక్, అహోబిలం ప్రభాకర్, చెన్నరాజు, మిమిక్రీ మధు తదితరులు కవులుగా గణనీయమైన గుర్తింపు పొందారు. పొన్నాల బాలయ్య, సిద్దెంకి యాదగిరి, తైదల అంజయ్య కవిత్వంతోపాటు, కథలు, నవలలు రాసి సాహిత్య ప్రపంచంలో తమదైన ముద్ర వేశారు. నిరంతరం కొత్త కవులను పరిచయం చేస్తూ, ఒక సృజనశాలగా ‘మరసం’ తన ప్రయాణాన్ని నిత్యనూతనంగా సాగిస్తున్నది.
మంజీరా రచయితల సంఘం 40 ఏండ్ల వసంతోత్సవ సభ అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నది. ఈ మహాసభకు సిద్దిపేట శాసనసభ్యుడు, మాజీ మం త్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సభలో ద్రవిడ దృక్పథంపై జిలుకర శ్రీనివాస్, దళిత దృక్పథంపై కోయి కోటేశ్వర్ రావు, మహిళా దృక్పథంపై నెల్లుట్ల రమాదేవి ప్రసంగించనున్నారు. ఈ వేదికగా ‘మరసం’ ఇప్పటివరకు సాగించిన ఘనమైన ప్రస్థానాన్ని సమీక్షించుకుంటూనే..వర్తమాన సామాజిక సవాళ్లను ఎదుర్కోవడానికి తగిన కార్యాచరణను, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోబోతున్నది.
(వ్యాసకర్త: మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు)
-కె. రంగాచార్య ,8499990345