వాతావరణ మార్పులు.. ‘ఫలరాజం’పై పగబట్టాయి. డిసెంబర్లో మొదలైన చలి, సంక్రాంతికి చుట్టుముట్టిన పొగ మంచు.. మామిడి తోటలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇప్పటికే పూత ఆలస్యం కావడంతో పాటు, వచ్చిన పిందెలు కూడా రాలిపోతున్నాయి. ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు వల్ల పలు రకాల తెగుళ్లు సోకుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ మామిడి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ సమయంలో ‘పూత, పిందె’ను కాపాడుకోకుంటే..తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.
‘మామిడి’ దిగుబడిపై గంపెడాశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలేలా ఉంది. పూత, పిందెకట్టే సమయంలో వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులు, తోటలపై తీవ్ర ప్రభావం చూపాయి. సాధారణంగా డిసెంబర్ ఆఖరు వారంలోనే మామిడిలో పూత రావాల్సి ఉన్నది. కానీ, ఇప్పటికీ సగానికిపైగా చెట్లు మొగ్గ కూడా కట్టకపోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనున్నది. చలి తీవ్రతలో హెచ్చుతగ్గులు, వాతావరణ మార్పులు, పొగమంచు వల్లే పూత రావడం ఆలస్యమవుతున్నదని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. మామిడిలో పూత రావడానికి, పిందెలు రాలకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు.
సూక్ష్మపోషకాల వినియోగం
మామిడిలో పూత, పిందెలు బాగా రావడానికి జింక్, బోరాన్లాంటి సూక్ష్మపోషకాలు సహకరిస్తాయి. ఆకుల్లో పచ్చదనం వృద్ధి చెందేందుకు జింక్ దోహదపడుతుంది. జింక్ లోపించిన మొక్కల్లో ఆకులు చిన్నగా మారి, రెమ్మల ఎదుగుదల మందగిస్తుంది. ఫలితంగా మొక్కలు బలహీనపడతాయి. దీంతో పూత రాదు. ఇక బోరాన్.. మామిడి పూత, పిందె రావడానికి సాయపడుతుంది. పూగుత్తుల్లో పిందెకట్టే ద్విలింగ పుష్పాలు అధికంగా రావడానికి దోహదపడుతుంది. పూర్తిస్థాయిలో ఫలదీకరణ జరిగి, పిందెలు అధికంగా ఏర్పడటానికి బోరాన్ ఉపయోగపడుతుంది. బోరాన్ లోపించిన చెట్లలో పిందె రాలడం ఎక్కువగా కనిపిస్తుంది. కాయలపై బుడిపెలు రావడం, బంక కారడం, పగుళ్లు ఏర్పడటం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. దీనిని నివారించడానికి జింక్, బోరాన్ ఉండే సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని మామిడి చెట్లపై పిచికారీ చేయాలి.
పూత ఆలస్యమైన తోటల్లో పూమొగ్గలను ఉత్తేజపరిచేందుకు.. లీటర్ నీటిలో 10 గ్రా. మల్టీ – కె (పొటాషియం నైట్రేట్ ), 5 గ్రా. యూరియా చొప్పున కలిపి, రెమ్మలు తడిచేలా పిచికారీ చేయాలి. యూరియా, మల్టీ – కెలోని నత్రజని, పొటాష్ కలిసి పూమొగ్గలను ఉత్తేజపరుస్తాయి. పూత బాగా రావడంతోపాటు పిందె కట్టడానికి, కాయలు నాణ్యంగా ఎదగడానికీ సహకరిస్తాయి.
పిందె రాలడాన్ని అరికట్టడానికి 10 లీటర్ల నీటిలో 2మి.లీ. ప్లానోఫిక్స్ కలిపి పూరెమ్మలు మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి.
వర్షాభావంతో ఎరువులు వేయలేకపోయిన రైతులు, పిందె దశలో అరకిలో యూరియా, అరకిలో పొటాష్ వేసుకోవాలి.
nనీటి వసతి లేనట్లయితే, 15 రోజుల వ్యవధిలో ఒక శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
పూత ఆలస్యమైన తోటల్లో, కాయ పెరుగుదల సమయంలో డ్రిప్ ద్వారా నీరు అందించాలి.
తెగుళ్లతోనూ తీవ్ర నష్టం..
జనవరి, ఫిబ్రవరిలో చలి తీవ్రత వల్ల తోటల్లో తెగుళ్లు, చీడపీడల ఉధృతి పెరిగింది. తేనెమంచు, బూడిద తెగులు, రసంపీల్చే పురుగులు కనిపిస్తున్నాయి. ఇవి పూత, పిందె, కాయ దశల్లో చెట్లను ఆశించి, ఎక్కువగా నష్టపరుస్తాయి. ప్రస్తుతం మామిడి పంటలో తేనెమంచు పురుగు, తామర పురుగులు, బూడిద తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నది. నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు.
తేనెమంచు పురుగు..
ఈ పురుగులు పుష్ప గుచ్ఛాలు, పూలు, పిందెల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల పూత, పిందె రాలిపోతాయి. ఇవి విసర్జించిన తేనెలాంటి తియ్యని పదార్థంపై, కొన్ని రకాల శిలీంధ్రాలు పెరుగుతాయి. తోటల్లో కలుపు ఎక్కువగా, వాతావరణం మబ్బుగా ఉండి, గాలిలో తేమ శాతం ఎక్కువగా, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువ.
నివారణ : లీటర్ నీటిలో 1 మి.లీ. ల్యాండసైహలొత్రిన్ లేదా 2.5మి.లీ. మోనోక్రోటోఫాస్ చొప్పున కలిపి పూత మొదలయ్యే, పిందెలు తయారయ్యే సమయాల్లో పూత ఆకులతోపాటు మొదళ్లు, కొమ్మలపైనా పిచికారీ చేయాలి. అయితే, పూత పూర్తిగా విచ్చుకోకముందే ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. మొగ్గదశలో ఉన్న తోటల్లో తేనెమంచు పురుగులు కనిపిస్తే.. లీటర్ నీటిలో 0.5మి.లీ. కాన్ఫిడార్ లేదా 0.5గ్రా. థయోమిథాక్సామ్ (అక్టారా) కలిపి పిచికారీ చేయాలి. తోటలో నీరు నిల్వ లేకుండా చేయడం ద్వారా వీటి ఉధృతిని తగ్గించవచ్చు.
తామర పురుగులు
మామిడి పూత, కాయల నుంచి తామర పురుగులు రసాన్ని పీలుస్తాయి. రెండు మిల్లీ మీటర్ల పొడవుండి కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరుతాయి. ఆకులను గోకి, రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో చిగురు ఆకులు చిన్నవిగా మారి, ఆ తర్వాత రాలిపోతాయి. పుష్ప గుచ్ఛాలు, పిందెలపైన చర్మాన్ని గీకి రసం పీలుస్తాయి. ఫలితంగా వక్క రంగులో చర్మం బీటలుబారి, రాతి మంగు ఏర్పడుతుంది. కాయ నాణ్యత దెబ్బతింటుంది.
నివారణ : తామర పురుగుల నివారణ కోసం.. పిందెలు ఎదిగే (నల్ల పూత) దశలో లీటర్ నీటిలో 1.5మి.లీ. టర్మిడాల్ కలిపి పిచికారీ చేయాలి. పూమొగ్గ (తెల్ల పూత) దశలో ఉన్నట్లయితే లీటర్ నీటిలో 1మి.లీ. ల్యాండసైహలోత్రిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
బూడిద తెగులు
రాత్రి సమయంలో చలి, పగటి పూట వేడి వాతావరణం వల్ల బూడిద తెగులు విజృంభిస్తుంది. పూత, పిందెలపై తెల్లని పొడిలాంటి బూజు ఏర్పడుతుంది. చివరికి పూలు, పిందెలు రాలిపోతాయి.
నివారణ : లీటర్ నీటిలో 3గ్రా. నీటిలో కరిగే గంధకం (సల్ఫర్) లేదా 2మి.లీ. హెక్సాకొనజోల్(కాన్టాఫ్ ఫ్లస్) కలిపి పిచికారీ చేయాలి.
కవర్లు కట్టుకోండి!
‘మామిడి’లో దిగుబడిని పెంచడానికి ‘కాయలకు కవర్’ కట్టడం మంచి పద్ధతి. ‘మ్యాంగో ప్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్’ కట్టడం వల్ల కాయలు అధిక బరువు పెరగడంతోపాటు చీడపీడల నుంచి రక్షణగా ఉంటుంది. చెట్టుపై ఉన్న మామిడి కాయ కోడిగుడ్డు సైజులో ఉన్నప్పుడే.. ఒక్కో కాయకు ఒక్కో కవర్ కట్టాలి. అంతకుముందే కాయలను గుడ్డతో శుభ్రంగా తుడవాలి. కాయ కిందిభాగం నుంచి తొడిమ పైభాగంలో 3 సెంటీమీటర్ల పైన కవర్ను కట్టాలి. దీనివల్ల తొడిమ వద్ద నల్లగా మసిపట్టడం, పురుగు పట్టడం, సొనకారడం లాంటివి నిరోధించవచ్చు. గాలిదుమారం వచ్చినప్పుడు కాయ రాలకుండా ఉంటుంది. వడగండ్ల వానతో కాయ పాడవదు. కాయలకు పురుగు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చెట్టు మీదనే సహజసిద్ధంగా పండుతాయి. మామూలు కాయ కంటే అదనంగా 100 గ్రాముల వరకూ బరువు పెరుగుతుంది.
ఇదే కీలకం..
ప్రస్తుత పూత, పిందెలు వచ్చే కీలక దశలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే, అధిక దిగుబడులు పొందవచ్చు. వాతావరణ మార్పుల వల్ల మామిడికి పలు రకాల తెగుళ్లు సోకుతున్నాయి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మామిడి పూత, కాత, కాయ నాణ్యత మెరుగుపరచడానికి స్థూల పోషకాలతోపాటు జింక్, బోరాన్, మాంగనీస్, ఐరన్లాంటి సూక్ష్మ పోషకాల అవసరం ఎంతో ఉంటుంది. అవసరాన్ని బట్టి ఆయా పోషకాల మిశ్రమాలను పిచికారీ చేయాలి.
గద్దె జ్యోతి, ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ (రాజేంద్రనగర్)
అప్రమత్తత అవసరం..
మామిడి తోటల్లో పూత సమయం, కాయ దశే అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు అప్రమత్తంగా లేకుంటే, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పూత, పిందె రాలకుండా సరైన జాగ్రత్తలు పాటించాలి. డిసెంబర్, జనవరి నెలల్లో చలి తీవ్రత వల్ల పూత రావడం ఆలస్యమైంది. వచ్చిన పిందెలు కూడా రాలిపోతున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కావాల్సిన సూక్ష్మపోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. చలి, అకాల వర్షాలతో చీడపీడలు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం తేనెమంచు, బూడిద తెగులు, రసంపీల్చే పురుగులు కనిపిస్తున్నాయి.
ప్రతాప్ సింగ్, ఉద్యానశాఖ అధికారి (జగిత్యాల)
కొత్తూరి మహేశ్ కుమార్