Manchu Manoj -Bhuma Moinka Reddy Wedding | టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఫిలింనగర్లోని మంచు లక్ష్మీ ఇంట్లో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ సెలబ్రెటీలు, మంచు అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా వీరిద్దరికీ ఇది రెండో వివాహం. 2015లో మంచు మనోజ్, ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటిరిగానే ఉంటున్న మనోజ్ గతేడాది నుంచి భూమా నాగిరెడ్డి రెండో కూతురు.. భూమా మౌనికా రెడ్డితో రిలేషన్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా గతేడాది ఓ వినాయక మండపానికి వీరిద్దరూ కలిసి వెళ్లి పూజాలు జరిపించారు. దాంతో వీళ్ల పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇక మౌనికా రెడ్డి కూడా గతంలో గణేష్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకి ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ పలుకారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.