నల్లగొండ సిటీ, మార్చి 27 : పెళ్లి పేరుతో యువతిని ఓ యువకుడు మోసం చేసిన కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 27 ఏండ్ల జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ గురువారం న్యాయమూర్తి రోజా రమణి తీర్పు వెల్లడించారు. కేసు వివరాలు.. నల్లగొండ జిల్లా కనగల్లు మండలం పర్వతగిరికి చెందిన నల్లబోతు జగన్, గుర్రంపోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతికి ప్రేమ పేరుతో వల వేశాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. అనంతరం మొఖం చాటేయడంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో యువకుడు దోషిగా తేలడంతో న్యాయస్థానం యువతిని మోసగించి అత్యాచారం చేసిన కేసులో 10 సంవత్సరాల జైలు, రూ.వెయ్యి జరిమానా, అలాగే దళిత యువతిని మోసం చేసినందుకుగాను మరో 10 ఏండ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా అదేవిధంగా పెండ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో ఇంకొక 7 సంవత్సరాలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.