Malaysia : భార్యకు తెలియకుండా మరో మహిళతో విదేశీ యాత్రకు వెళ్లి ఎంజాయ్ చేసొద్దామని భావించిన ఆ భర్త ప్లాన్ బెడిసికొట్టింది. అనుకోని నాటకీయ పరిస్థితుల్లో ఆ భర్త.. భార్యకు దొరికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. పూనేకు చెందిన ఒక వ్యాపారవేత్త తన భార్యకు తెలియకుండా ప్రియురాలితో మలేసియా ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఆ మహిళ, అతడు కలిసి కౌలాలంపూర్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. అతడు తన భార్యతో బిజినెస్ ట్రిప్ కోసం వెళ్తున్నానని చెప్పాడు.
దీంతో భార్యకు చెప్పి సెప్టెంబర్ 14న ముంబైలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. ఆ మహిళతో కలిసి ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కడానికి కావాల్సిన ఇమ్మిగ్రేషన్ కోసం ప్రయత్నించారు. అయితే, ఆ మహిళ పాస్‌పోర్టు పాతది కావడం, అది పోయిందని గతంలో కంప్లైంట్ ఇచ్చి ఉండటం వల్ల ఆ పాస్‌పోర్టు చెల్లదని అధికారులు గుర్తించారు. పైగా.. పోయిందన్న పాస్‌పోర్ట్ ఎలా వచ్చిందని ఆ మహిళను ప్రశ్నించారు. ఇది లీగల్ సమస్యగా మారే అవకాశం ఉందని భావించిన ఆ ఇద్దరూ తమ ఫారిన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారు.
కానీ, ఈ పరిణామాల వల్ల తన ప్రయాణం రద్దు కావడం, మరో మహిళతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన విషయం భార్యకు తెలిసే అవకాశం ఉందని భావించాడు. ఈ విషయం భార్యకు తెలియకుండా ఉండేందుకు ఒక ప్లాన్ చేశాడు. తనకు ఇమ్మిగ్రేషన్ సమస్య వచ్చిందని, అందువల్ల అధికారులు తన ఫోన్ సీజ్ చేశారని ఎయిర్‌పోర్టులోని ల్యాండ్‌ఫోన్ నుంచి ఫోన్ చేసి భార్యకు చెప్పాడు. తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. తర్వాత ఆ మహిళతో కలిసి ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లి, అక్కడే ముంబైలోని హోటల్లో బస చేశారు. మరుసటి రోజు కూడా తన భార్యకు వాట్సాప్ వీడియో కాల్ చేశాడు.
అప్పుడు కూడా తన ఫోన్ సీజ్ అయిందని చెప్పాడు. కానీ, మరుసటి రోజు ఆ వ్యాపారవేత్త భార్య అతడికి ఫోన్ చేసింది. ఎంతకూ ఫోన్ కలవకపోవడంతో ఆ భార్య నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై పోలీసులు ఆరా తీస్తున్న విషయం తెలిసిన భర్త నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తాను కిడ్నాప్ కాలేదని చెప్పాడు. అయితే, ఫోన్ స్విచ్ఛాఫ్ ఎందుకు చేసుకున్నారు అని ఆరాతీయగా.. మొత్తం వ్యవహారం బయటపడింది. మరో మహిళతో మలేసియా వెళ్లేందుకు ప్లాన్ చేసిన విషయం భార్యకు తెలిసిపోయింది.