జనగామ రూరల్, సెప్టెంబర్ 28 : ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి గ్రామపంచాయతీ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం మండలంలోని ఎల్లంల గ్రామంలో చోటుచేసుకున్నది. అర్హులకు కాదని సర్పంచ్‌కు ఇల్లు మంజూరు కావడంతో గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద టెంట్ వేసుకొని నిరసనకు దిగారు. గ్రామంలోని వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో ఎంపీ, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వారి కోటాలో ఇండ్లు మంజురైనట్టు ఇటీవల ప్రచారం జరిగింది.
అందులో పేర్లు సహా జాబితా రావడంతో గతంలో ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్న బిర్రు రాజు పేరు అందులో లేదు. సర్పంచ్‌కు ఇందిరమ్మ ఇల్లు రావడం తమలాంటి పేదలకు రాలేదని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో బిర్రు రాజు తీవ్ర మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకున్నాడు. గ్రామస్తులు అతన్ని అడ్డుకొని బాటిల్‌ను తీసుకొని పక్కన పడేశారు. తన కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు అర్హులకు ఇండ్లు కేటాయించాలని కోరాడు.