న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. బెంగాల్లో బీఎస్ఎఫ్ అధికార పరిధి పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మమత డిమాండ్ చేశారు. దేశ సమాఖ్య నిర్మాణానికి విఘాతం కలిగించరాదని కోరారు. సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది బెంగాల్లో జరిగే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌ను ప్రారంభించేందుకు రావాలని ప్రధానిని ఆహ్వానించినట్టు చెప్పారు. త్రిపురలో తృణమూల్ నేతలపై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని కూడా ప్రధాని వద్ద ప్రస్తావించినట్టు తెలిపారు. వచ్చే యూపీ ఎన్నికలపై మమత స్పందిస్తూ.. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు తమ సహాయం కావాల్సి వస్తే, తప్పకుండా అందిస్తామని చెప్పారు. మరోవైపు, ఢిల్లీలో మమతాబెనర్జీతో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి భేటీ కావడం గమనార్హం.