బ్రిస్బేన్: కెప్టెన్ జో రూట్ (86 బ్యాటింగ్; 10 ఫోర్లు), డేవిడ్ మలన్ (80 బ్యాటింగ్; 10 ఫోర్లు) కీలక సమయంలో సత్తాచాటడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ కోలుకునే ప్రయత్నం చేస్తున్నది. తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. వీరిద్దరి పోరాటంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న ఇంగ్లిష్ జట్టు.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 58 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 343/7తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 425 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (152; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగగా.. స్టార్క్ (35), లియాన్ (15) విలువైన పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్, మార్క్‌వుడ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. మరో రెండు రోజుల ఆట మిగిలిఉన్న ఈ టెస్టులో శనివారం ఇంగ్లండ్ ఎన్ని పరుగులు చేస్తుందనేదానిపైనే ఫలితం ఆధారపడి ఉంది.
ఓవర్‌నైట్ స్కోరు 343/7తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా సాఫీగా ముందుకు సాగింది. స్టార్క్ నుంచి చక్కటి ప్రోత్సాహం లభించడంతో ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 85 పరుగులు జోడించాక స్టార్క్ ]ఔట్ కాగా.. లియాన్ కాసేపు అండగా నిలిచాడు. ఇక ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగదని గుర్తించిన హెడ్ భారీ షాట్లతో స్కోరు పెంచి చివరి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ దశలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు హసీబ్ హమీద్ (27), రోరీ బర్న్స్ (13) ఎక్కువ సేపు నిలువలేకపోవడంతో 61 పరుగులకే ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో వికెట్ పడితే కంగారూలకు మ్యాచ్‌పై పట్టు చిక్కడం ఖాయమే అనుకుంటున్న తరుణంలో మలన్‌తో కలిసి రూట్ చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న ఈ జోడీ.. ఒక్కసారి కుదురుకున్నాక మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ అభిమానులను అలరించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ తో పాటు స్టార్క్‌ను ఓ ఆటాడుకున్న వీరిద్దరూ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అభేద్యమైన మూడో వికెట్‌కు 159 పరుగులు జతచేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, స్టార్క్ చెరో వికెట్ పడగొట్టారు.
క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (1541) చేసిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా జో రూట్ రికార్డుల్లోకెక్కాడు. మైఖేల్ వాన్ (1481; 2002లో) రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా మహమ్మద్ యూసుఫ్ (పాకిస్థాన్ 1788; 2006లో) టాప్‌లో ఉన్నాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 147, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 425 (హెడ్ 152, వార్నర్ 94; రాబిన్సన్ 3/58, మార్క్ వుడ్ 3/85), ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 220/2 (రూట్ 86 నాటౌట్, మలన్ 80 నాటౌట్; కమిన్స్ 1/43).