Telangana Film Chamber | తెలంగాణలోని సినిమా ఎగ్జిబిటర్లు ఇండస్ట్రీలో ఒక సరికొత్త మార్పునకు శ్రీకారం చుడుతూ అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు కొనసాగుతున్న అద్దె పద్ధతికి స్వస్తి పలుకుతూ, మల్టీప్లెక్స్‌ల తరహాలోనే ఇకపై పర్సంటేజీ ఆధారిత రెవెన్యూ విధానంలో సినిమాలను ప్రదర్శించాలని హైదరాబాద్ నగరంలోని 23 ప్రముఖ సింగిల్స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుందని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సరికొత్త ఒప్పందం ప్రకారం థియేటర్లకు వచ్చే వసూళ్లలో సినిమా ప్రదర్శితమైన మొదటి వారం ఎగ్జిబిటర్లకు 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం నుంచి 40 శాతం చొప్పున వాటా దక్కనుంది.
ఈ నిర్ణయం వెనకున్న కారణాలను వివరిస్తూ ఫిల్మ్ ఛాంబర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ 23 ప్రీమియం సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణ భారంగా మారిందని, పాత అద్దె పద్ధతి వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని యాజమాన్యాలు వాపోయాయి. ప్రేక్షకులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మనుగడ సాగించడం కష్టంగా మారడంతోనే పర్సంటేజీ విధానం వైపు మొగ్గు చూపినట్లు వారు తెలిపారు. ఈ విషయమై రాష్ట్రంలోని అగ్రశ్రేణి డిస్ట్రిబ్యూటర్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, దాదాపు అందరూ దీనికి అంగీకరించారని ఛాంబర్ పేర్కొంది. అయితే ప్రముఖ పంపిణీదారుడు శశిధర్ రెడ్డి మాత్రం నిర్మాతలు, ఇతర భాగస్వాములతో మరోసారి మాట్లాడిన తర్వాతే తన తుది నిర్ణయాన్ని చెబుతానని వెల్లడించినట్లు సమాచారం.
ఈ విధానాన్ని కేవలం ఈ 23 థియేటర్లకే పరిమితం చేయకుండా, రాబోయే రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్లకు విడతల వారీగా విస్తరిస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. మార్చి 11న బెంగళూరులో జరిగిన దక్షిణ భారత ఎగ్జిబిటర్ల సమావేశంలో కూడా ఇవే అంశాలపై విస్తృతంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారని ఫిల్మ్ ఛాంబర్ గుర్తు చేసింది. మన రెండు తెలుగు రాష్ట్రాలు మినహాయించి దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల సింగిల్ స్క్రీన్లు ఇప్పటికే ఈ పర్సంటేజీ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయని నిర్మాతలు, పంపిణీదారులకు ఛాంబర్ వివరించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడకుండా బ్రతకాలంటే ఈ నిర్ణయం అనివార్యమని వారు తేల్చి చెప్పారు. చాలా కాలంగా ఎగ్జిబిటర్లు చేస్తున్న ఈ డిమాండ్‌కు హైదరాబాద్‌లోని 23 థియేటర్ల రూపంలో ఇప్పుడు బలమైన ముందడుగు పడింది.