కొల్లాపూర్, ఫిబ్రవరి 15 : భక్తుల కొంగుబంగారమైన కొల్లాపూర్ పట్టణ శివారులోని ఈదమ్మ దేవత ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 8వ తేదీన ఊరబోనాలతో ఉత్సవాలు ప్రారంభం కాగా.. ఐదు మంగళవారాలు వైభవంగా జరుగుతుంది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిడె మహోత్సవం మంగళవారం సాయంత్రం కనుల పండువగా నిర్వహించారు. తప్పెట్ల దరవుల మధ్య సిడె కదిలింది. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. పూజారి కురుమయ్య పొడువైన కర్ర చివరన గొర్రెను కట్టి మధ్యలో తెల్లచీర, జాకెట్ ధరించి విధువరాలి వేషధారణలో నిల్చొని భక్తులపై బండారు చల్లుతూ గుడి చుట్టూ తిప్పారు. సిడెను తాకితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకంతో భక్తులు తాకేందుకు పోటీపడ్డారు. ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీలోని రాయలసీమ ప్రాంతాలైన కర్నూల్, ప్రకాశం జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈదమ్మ తల్లీ.. దీవించమ్మా.. అంటూ వేడుకున్నారు. మహిళలు బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మూడో వారం సిద్దులవారం, నాల్గో వారం సుద్దులవారం, ఆఖరి వారి నెల పూజలతో ముగియనున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి భక్తులు ఇక్కడికొచ్చి నైవేద్యం సిద్ధం చేయడంతోపాటు కోళ్లు, పొట్టేళ్లను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీచారి, ప్రజాప్రతినిధులు ఈదమ్మ తల్లిని దర్శించుకున్నారు. సిడె మహోత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈదమ్మ తల్లి అనుగ్రహంతోనే సోమశిలం-సిద్ధేశ్వరం వంతెన, ఫోర్‌లైన్ రోడ్డు సాధించినట్లు తెలిపారు. జాతర ప్రాంగణంలోని దుకాణాల్లో ఎమ్మెల్యే కొనుగోళ్లు జరిపారు. ఎస్సై బీవీ రమణ యాదవ్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత దూరెడ్డి రఘవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖరాచారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంచందర్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు పరశురాంగౌడ్, కిషన్ నాయక్, పిన్నంశెట్టి బాలు, నిరంజన్, కేశవులు, గోపాల మల్లయ్య, కౌన్సిలర్లు రాముడు యాదవ్, కృష్ణమూర్తి, పస్పుల కృష్ణ పాల్గొన్నారు.