మహబూబ్‌నగర్ నవంబర్ 11 : ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. జిల్లాలో ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు 17మంది నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్, మార్కుడు కాపీ నోడల్ అధికారులుగా డీపీవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో కృష్ణను నియమించినట్లు చెప్పారు. వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ నోడల్ అధికారులుగా సత్యనారాయణ, చంద్రశేఖర్, ఎన్నికల సామగ్రి పం పిణీ కేంద్రం, స్ట్రాంగ్‌రూం నోడల్ టీమ్ అధికారులుగా ప్ర త్యేక కలెక్టర్ పద్మశ్రీ, తాసిల్దార్ పార్థసారధి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ ఉంటారని వెల్లడించారు. ట్రాన్స్‌ఫోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా డాక్టర్ వెంకటేశ్వరరావు, ట్రైనింగ్ మెనేజ్మెంట్ అధికారిగా సుచరితతోపాటు పలు విభాగాలకు అధికారులను నియమించినట్లు కలెక్టర్ తెలిపా రు. నోడల్ అధికారులు రోజూవారీగా నివేదికలు సమర్పించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు తొమ్మిది పో లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో కొవిడ్ -19 బృందాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శశికాంత్‌ను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు సీతారామారా వు, తేజస్ నందలాల్ పవర్, నోడల్ అధికారులు ఉన్నారు.