‘పల్లె ప్రగతి’తో తలెత్తుకున్న ఉత్తరతండా
అనుబంధ గ్రామం నుంచి అభివృద్ధి వైపు పయనం
జీపీ పరిధిలో ముచ్చటగా మూడు ప్రకృతి వనాలు
ఆహ్లాదాన్ని పంచుతున్న వాతావరణం
డ్రైనేజీలు, డంపింగ్ యార్డుతో తీరిన మురుగు, చెత్తాచెదారం సమస్య
సీసీ రోడ్లతో మెరుస్తున్న వీధులు
మహబూబాబాద్ రూరల్, మార్చి 26 : ఉత్తరతండా మహబూబాబాద్ మండలకేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మొన్నటివరకు అనుబంధ గ్రామంగా ఉన్న ఈ తండా.. ఇప్పుడు గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామ పరిధిలో నేతాజీ తండా, సోమ్లాతండా ఉన్నాయి. పల్లె ప్రగతిలో కార్యక్రమం ఈ గ్రామ రూపురేఖలు మార్చేసింది. ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న నిధులను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయడంతో అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. తండాకు ఒకటి చొప్పున మూడు తండాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు మరింత శోభను తెచ్చాయి. మూడు వనాల్లో సుమారు 1600 మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. రోడ్ల వెంబడి నాటిన తీరొక్క మొక్కలు ఆహ్లాదం పంచుతున్నాయి. వైకుంఠధామం, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న మూడు పాడుబడిన బావులను పూడ్చివేశారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేశారు. అన్ని కూడళ్లలో చెత్త కుండీలు ఏర్పాటు చేశారు. తడి పొడి చెత్త సేకరణ కోసం ప్రతి ఇంటికీ బుట్టలు పంపిణీ చేశారు. నిత్యం జీపీ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ తిరుగుతూ తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి, ఊరిని శుభ్రంగా ఉంచుతున్నారు. పరిసరాల పరిశుభ్రత, చెత్త సేకరణపై గ్రామ సభల ద్వారా 15 రోజులకోసారి గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉత్తరతండాలోని ఆరు కాలనీల్లో సీసీ రోడ్లు వేయించారు. మురుగు నీరు రోడ్లపైకి రాకుండా డ్రైనేజీలు నిర్మించా రు. హరితహారం మొక్కల కోసం గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేశా రు. మొత్తంగా ఉత్తరతండా ఆదర్శ తండాగా రూపుదిద్దుకుంటున్నది.