టైటిల్ చూడగానే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ గుర్తుకొస్తే అది పొరపాటు కాదు. కానీ, ఇది మొగుడూ పెళ్లాల దెబ్బలాట! మొగుడూ పెళ్లాలన్నాక తగువులుంటాయ్. అప్పుడప్పుడూ ఆవేశంతో దెబ్బలాటలూ ఉంటాయి. సినిమాల్లో మొగుడూ పెళ్లాలుగా నటించేవాళ్లూ దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుంది? నటులకు బాధ, ప్రేక్షకులకు ఆనందం. ఎందుకంటే సినిమా రక్తి కడుతుంది. వీధిలో మొగుడూ పెళ్లాలు కొట్టుకుంటే గుంపులు గుంపులుగా చూసే జనంలాగే.. ఇప్పుడా కొట్లాట ముచ్చట్లను హిందీ సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. నానాపటేకర్, మధుబాల జంటగా నటించిన యశ్వంత్ సినిమా షూటింగ్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు బాలీవుడ్ అభిమానుల్లో చర్చకు వచ్చింది. మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఆ సినిమా షూటింగ్ విశేషాలను మధుబాల మీడియాతో పంచుకుంది. ‘యశ్వంత్ సినిమా చివరి సన్నివేశం కోసం షూటింగ్ జరుగుతున్నది.
నానాపటేకర్కి నాకు మధ్య గొడవ జరిగే సన్నివేశం అది. ఆయన ఎలాంటి హావభావాలనైనా తేలిగ్గా పండిస్తారు. నేను అంత సహజంగా నటించలేను. మా ఇద్దరి మధ్య గొడవ జరిగే సందర్బంలో నేను ఏడ్వాల్సి ఉంది. కానీ, కన్నీళ్లు రావట్లేదు. బాధగానూ అనిపించలేదు. అప్పుడు గ్లిజరిన్ కోసం ట్రై చేద్దామనుకోగానే నానాపటేకర్ నా చెంపపై లాగి ఒక్కటి కొట్టారు. విపరీతమైన బాధే కాదు ఆయనపై కోపం వచ్చింది. వెనువెంటనే తిరిగి ఆయన చెంప చెళ్లుమనిపించాను. అంతే మా డైరెక్టర్ ‘కట్’ అన్నారు. ఒక్క దెబ్బతో అనుకున్నట్టుగా వచ్చిందని డైరెక్టర్ అనిల్ మట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ ప్యాకప్ చెప్పారు. నానాపటేకర్ ఎందుకు కొట్టారో అప్పుడు అర్థమైంది. ఆయన మంచి మనిషి. సహనటులతో చాలా గౌరవంగా ఉండేవారు. కానీ, నటన విషయంలో చాలా సీరియస్గా ఉంటార’ని చెప్పుకొచ్చింది మధుబాల. మొత్తానికి మధుబాల తాజా ఇంటర్వ్యూతో… ‘యశ్వంత్’ సినిమా సీన్ సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో మళ్లీ వైరల్ అవుతుండటం విశేషం.