తెలుగు సినీ పరిశ్రమలో మరో వైవిధ్యమైన కంటెంట్‌తో కూడిన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. శ్రీరామ్, స్వాతి మందాడి ప్రధాన జంటగా నటించిన తాజా చిత్రం ‘మా రాముడు అందరివాడు’. అనుముల ప్రొడక్షన్స్ మరియు శ్రీరామ్ క్రియేషన్స్ పతాకాలపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. యుద్ధనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదలకు ముస్తాబైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక చిత్ర పరిశ్రమలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనుండగా, నిర్మాత అనుముల లక్ష్మణరావు వైల్డ్ విలన్‌గా విభిన్నమైన షేడ్స్‌లో అలరించనున్నారు. సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సుమారు 200లకు పైగా థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో ఉంది.
ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర బృందం పంచుకున్న విశేషాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సినిమా ఘన విజయం సాధించి టీమ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ, ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ శాశ్వతమని, హీరో శ్రీరామ్‌లో అద్భుతమైన నైపుణ్యం ఉందని కొనియాడారు. ఇందులో తాను ఒక ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తానని, సమాజానికి మంచి సందేశం ఇచ్చే పాత్ర ఇదని చెప్పారు. దర్శకుడు మైకిల్ ప్రతి విషయంలోనూ మంచి క్లారిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ట్విస్టులు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని తెలిపారు.
దర్శకుడు యుద్ధనపూడి మైకిల్ మాట్లాడుతూ, సుమారు పద్నాలుగు నెలల పాటు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ ఈ ప్రయాణం సాగించామని తెలిపారు. కేవలం డైరెక్షనే కాకుండా కథ, మాటలు, పాటలు రాసి, రెండు పాటలకు కొరియోగ్రఫీ కూడా అందించినట్లు పేర్కొన్నారు. మారెడుమిల్లి ఫారెస్ట్ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని, అందరికీ ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హీరో శ్రీరామ్ మాట్లాడుతూ, చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్‌ను మాత్రమే ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. తెలుగు ప్రేక్షకులు మన సినిమాలను మనమే ప్రోత్సహించుకుంటేనే మరింత ముందుకు వెళ్లగలమని, ఈ చిత్రంలో బలమైన కంటెంట్, దమ్మున్న సన్నివేశాలు ఉన్నాయని చెప్పారు. తన కెరీర్లో ఇది మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత లక్ష్మణరావు మాట్లాడుతూ, ఫస్టాఫ్‌లో 20 ఏళ్లు ఎమ్మెల్యేగా అరాచకాలు సృష్టించే వైల్డ్ విలన్‌గా తాను నటించానని, సీఎంగా సుమన్గారితో వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయని తెలిపారు. ట్రైలర్ చూసిన తర్వాత అందరూ అభినందిస్తున్నారని, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను విజయవంతం చేయాలని కోరారు.
చిత్ర యూనిట్ & సాంకేతిక నిపుణులు:
సినిమా పేరు: మా రాముడు అందరివాడు (Ma Ramudu Andarivadu)
బ్యానర్లు: అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్
నటీనటులు: శ్రీరామ్, స్వాతి మందాడి, సుమన్, నాగ మహేష్, సమ్మెట గాంధీ, బాహుబలి ప్రభాకర్, అనుముల లక్ష్మణరావు తదితరులు
దర్శకత్వం: యుద్ధనపూడి మైకిల్
నిర్మాతలు: అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు
సంగీతం: మనీష్ కుమార్
సినిమాటోగ్రఫీ: వినోద్
విడుదల తేదీ: సెప్టెంబర్ 4