‘పల్లె భాషను నమ్ముకొని పరిశ్రమకు వచ్చాను. మరుగున పడిన మాండలికం నా పాట ద్వారా మళ్లీ వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది. నేటి యువత కూడా ఆ పదాల గురించి తెలుసుకోవడం రచయితగా సంతృప్తినిస్తున్నది’ అన్నారు ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్. గత ఏడాది ‘బలగం’ చిత్రంలోని పాటకుగాను ఉత్తమ గేయ రచయితగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న ఆయన.. ప్రస్తుతం భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. నాని ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఆయన రాసిన ‘ఆయా షేర్’ పాటకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం గీత రచయిత కాసర్ల శ్యామ్ విలేకరులతో ఆ పాట తాలూకు విశేషాలను పంచుకున్నారు.