LPU : పంజాబ్, ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో విద్యార్థినిపై అత్యాచారం జరిగిందంటూ ప్రచారం ఊపందుకుంది. దీంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళ పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. శనివారం రాత్రి యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్ని ఎస్ఎస్పీ గౌరవ్ తూరా వెల్లడించారు. యూనివర్సిటీలో ప్రచారం జరుగుతున్నట్లు విద్యార్థినిపై ఎలాంటి అత్యాచారం జరగలేదన్నారు.
ఈ అంశంపై తమకు ఎలాంటి ఫర్యాదు అందలేదని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని, వదంతుల్ని నమ్మి విద్యార్థులు ఆందోళనకు దిగారని తెలిపారు. విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకుని తాము ఇక్కడికి వచ్చామని, ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు అన్నారు. ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదన్నారు. ఈ అంశంపై విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడామని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు.
విద్యార్థులు కొన్ని అంశాలపై ఫిర్యాదు చేశారని, అయితే, వారిలో స్పష్టత లేదన్నారు. వాళ్లకు కొన్ని అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేస్తామన్నారు. అసలు ఈ సోషల్ మీడియా పోస్టు ఎవరు చేశారు.. ఎక్కడ్నుంచి, ఎలా మొదలైంది అనే అంశాలపై విచారణ జరుపుతున్నామని ఎస్ఎస్పీ గౌరవ్ తెలిపారు. తమ యూనివవర్సిటీ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న వదంతుల నేపథ్యంలో విద్యార్థినీ, విద్యార్థులు శనివారం రాత్రి భారీ స్థాయిలో ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లోని పూల కుండీలు, ఇతర ఆస్తుల్ని ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.
అలాగే, జలంధర్-ఫగ్వారా హైవేను కూడా విద్యార్థులు దిగ్భందించి, నిరసన చేపట్టారు. అర్ధరాత్రి 2.00 గంటల నుంచి ఈ నిరసన భారీ స్థాయిలో కొనసాగింది. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై విద్యార్థులు ఘర్షణకు దిగారు. దీంతో పరిస్తితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు.. యూనివర్సిటీ యాజమాన్యం కూడా ఈ ప్రచారాన్ని ఖండించింది. ఆదివారం కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.