అమరావతి : ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య ( Suicide ) చేసుకున్న ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లికి ఇరువురు పెద్దలు ఒప్పుకోకపోవడంతో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన భారతి, కంబగిరి రాముడు కొమరోలు మండలం అక్కపల్లి సమీపంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.
ఇరువురు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని, అయితే వరుసకు ఇద్దరు అన్నా, చెల్లెలు అవుతారని.. అందుకే పెళ్లికి ఒప్పుకోలేదని కుటుంబ సభ్యులు వివరించారు. గతంలో భారతికి వేరే వ్యక్తితో వివాహం జరుగగా రాముడుపై ఉన్న ప్రేమతో భర్తకు దూరంగా భారతి ఉంటోంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమికుల ఆత్మహత్యతో ఇరువురి స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.