న్యూఢిల్లీ, జనవరి 31: వ్యవస్థలో అధికంగా ఉన్న లిక్విడిటీ, దివాలా ప్రక్రియలు నిలిచిపోవడం ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక రిస్క్‌లని ఆర్థిక సర్వే పేర్కొంది. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వ్యవస్థలోకి రిజర్వ్‌బ్యాంక్ భారీగా ద్రవ్యాన్ని విడుదల చేసింది. అలాగే దివాలా ప్రక్రియల్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. దీర్ఘకాలంగా ఇవి ఆర్థిక వ్యవస్థకు రిస్క్‌గా మారే అవకాశం ఉందని సర్వే హెచ్చరించింది. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ గ్యారంటీల్విడాన్ని సర్వే ప్రస్తావిస్తూ ఈ రంగంలో డిఫాల్ట్‌లు ఏర్పడవచ్చన్నది.
బ్యాంక్ ఎన్పీఏలు తగ్గినా…
బ్యాంకింగ్ వ్యవస్థలో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) మొత్తంమీద తగ్గినప్పటికీ, పునర్వ్యవస్థీకరించిన రుణాలు పెరిగాయని ఆర్థిక సర్వే తెలిపింది. 2021 సెప్టెంబర్‌నాటికి బ్యాంక్‌ల ఎన్పీఏలు అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7.5 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గాయి. ఇదే కాలంలో పునర్వ్యవస్థీకరించిన రుణాల శాతం మొత్తం అడ్వాన్సుల్లో 0.4 శాతం నుంచి 1.5 శాతానికి చేరాయి. దీంతో మొత్తంగా ఒత్తిడిలో ఉన్న రుణాలు 7.9 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగినట్లు సర్వే వెల్లడించింది.