వరంగల్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ మహానగరంలోని 14వ డివిజన్.. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని రామసముద్రం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఎస్సార్‌నగర్ బస్తీ.. 700 కుటుంబాల సముదాయం.. తాటిపత్రి గుడిసెలు, పక్కా ఇండ్లు, రూఫ్‌టాప్ ఇండ్లు.. ఎవరి తాహతు మేరకు వారు దశాబ్దాల క్రితమే కట్టుకున్నారు. వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ మంగళవారం తన సిబ్బందితో అక్కడికి ప్రభుత్వ వాహనంలో వచ్చారు. సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల కోసం ఆయన అక్కడికి వెళ్లారు. తహసీల్దార్ వాహనం ఎస్సార్ నగర్ ఏరియాలోకి ప్రవేశించగానే అక్కడి పేద ప్రజల్లో ఉలికిపాటు మొదలైంది. హైదరాబాద్‌లో హైడ్రా తరహాలోనే ఇక్కడా తమ ఇండ్లను కూల్చివేస్తారేమోననే భయంతో వారిలో అలజడి మొదలైంది. సర్కారు కూల్చివేత చర్యలకు సహకరించేది లేదంటూ తిరుగుబాటు మొదలైంది. నిమిషాల్లోనే ఆ బస్తీ వాసులందరూ అక్కడికి చేరుకున్నారు. తహసీల్దార్ వాహనం కదలకుండా అడ్డుకున్నారు.
తమ ఇండ్లను కూల్చొద్దని మొరపెట్టుకున్నారు. అక్కడ జరిగేది తహసీల్దార్‌కు, ఆయనతో వచ్చిన సిబ్బందికి అర్థం కాలేదు. సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల కోసం వచ్చానని, మిగిలిన విషయాలు తనకు తెలియదని తహసీల్దార్ వివరించారు. ఆయన చెప్పే విషయాన్ని చాలా సేపటి వరకు అర్థం చేసుకోలేకపోయారు. బస్తీ పెద్దలతో మాట్లాడిన తర్వాత అందరూ నెమ్మదించారు. తహసీల్దార్ వచ్చింది ఇండ్ల సర్వేకు కాదని, బతుకమ్మ ఏర్పాట్ల కోసం అని సర్దిచెప్పారు. పండుగ పూట తమ ఇండ్లలో ప్రశాంతంగా ఉండొచ్చని నిమ్మలపడ్డారు. కాంగ్రెస్ సర్కారు మళ్లీ ఎప్పుడు తమ ఇండ్లను కూలుస్తుందోనని మరికొందరు ఆవేదనతోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత హైదరాబాద్‌తోపాటు రాష్ట్రమంతటా ఇప్పుడు ఒకటే భయం పట్టుకున్నది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్.. ఏదైనా సరే ప్రభుత్వ అధికారి వచ్చినా, అక్కడి నుంచి సర్కారు వాహనం వెళ్లినా పేదలు ఉలిక్కిపడుతున్నారు. జనావాసప్రాంతాల్లోనూ కాంగ్రెస్ సర్కారు ఇండ్లపై ఎర్ర రంగులు పూస్తున్నది. ‘మీ ఇండ్లు కూల్చివేస్తాం’ అని బెదిరిస్తున్నది. చెరువులను ఆక్రమించి భవంతులు కట్టిన పెద్దల జోలికి పోకుండా పేదల గుడిసెలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చుతున్నదన్న భయం ఇప్పుడు రాష్ట్రమంతటా పాకింది. అందుకే వరంగల్ నగరంలో తహసీల్దార్ బతుకమ్మ ఏర్పాట్ల కోసం వచ్చినా ఇండ్ల కూల్చివేతకే అనుకుని పేదలు భయపడ్డారు.
కేసు నమోదుతో వేధింపులు
హైడ్రా భయంతో వరంగల్‌లోని పేదలు ఇండ్లను కాపాడుకునేందుకు తహసీల్దార్ వాహనాన్ని అడ్డుకున్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు తీవ్రంగా పరిగణించారు. సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల కోసం వచ్చిన అధికారిని అడ్డుకున్నారనే ఆరోపణలతో వరంగల్ ఎస్సార్ నగర్ వాసులపై కేసులు నమోదు చేసినట్టు ఎనుమాముల ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. కాగా తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్‌పై జరిగిన దాడిని ట్రెసా, హనుమకొండ జిల్లా టీఎన్జీవో నాయకులు ఖండించారు. ఘటన బాధ్యులైపై చర్యలు తీసుకోవాలని కోరారు.