హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారుల పెండింగ్ రుణ దరఖాస్తులను పరిశీలించి నెలాఖరులోగా మంజూరు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ అదనపు కార్యదర్శి సంజయ్‌కుమార్ బ్యాంకర్లకు సూచించారు. తెలంగాణకు చెందిన 3.40 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 3.43 లక్షల మందికి రుణాలు అందజేసి 101 శాతం లక్ష్యాన్ని చేరుకొన్నారని అన్నారు. సోమవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వీధి వ్యాపారుల రుణాలపై సంజయ్‌కుమార్ సమీక్షించారు. తెలంగాణలో ఇప్పటివరకు 4.07 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.57 లక్షల మందికి రుణాలను మంజూరు చేశారని, 87.66 శాతం రుణాలు అందజేశారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు మంజూరు అయ్యేలా చూడాలని చెప్పారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అప్డేట్ చేయాలని సూచించారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ లక్ష్యాన్ని మించిందని ప్రశంసించారు. ఈ సమీక్షా సమావేశంలో సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, ఎస్ఎస్బీసీ అధ్యక్షుడు అమిత్ జింగ్రాన్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ క్రిషన్ శర్మ, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు.