Little Hearts | ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకులని అలరించిన చిత్రం లిటిల్ హార్ట్స్. ఈ మూవీలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఎవరు లేరు.. పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఉండవు.. యాక్షన్ సీక్వెన్సు అసలే ఉండవు, స్పెషల్ సాంగ్స్ కనిపించవు. సినిమా రిలీజ్‌కి ముందు కూడా పెద్ద హంగామా ఏమి చేయలేదు. కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.40 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. యూత్‌కి మాంచి కిక్ ఇచ్చిన ఈ కామెడీని చాలా మంది ఆస్వాదించారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అడివి శేష్, బండ్ల గణేశ్ తదితర స్టార్ హీరోలు లిటిల్ హార్ట్స్ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.
టాలీవుడ్లో ఇటీవల యువతను ఆకట్టుకున్న సూపర్ హిట్ చిత్రాల్లో ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో హీరోగా టాలెంట్ నటుడు మౌళి తనూజ్ నటించాడు. యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సత్తాచూపించాడు. ఆయన సరసన హీరోయిన్ శివాని నాగారం డెబ్యూట్ చేశారు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమా పెద్ద విజయం సాధించింది.థియేటర్లలో మంచి హిట్ సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు ఈటీవీ విన్ ప్లాట్ఫామ్లో అక్టోబర్ 1నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్ల వర్షన్‌తో పోల్చితే ఓటీటీలో మరికొన్ని అదనపు కామెడీ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఈ సినిమాకి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈటీవీ విన్ మరియు బన్నీ వాస్ సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోగా, ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందే అవకాశం ఉంది. ఇప్పటికే థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే కుటుంబంతో కలిసి చూసే అవకాశాన్ని పొందారు. మృదువైన ప్రేమ, హాస్యం, భావోద్వేగాల మిశ్రమంగా ఉండే ‘లిటిల్ హార్ట్స్’ ఓటీటీలో కూడా మంచి రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం.