శరీరం కణాల నిర్మితం. అవి సరళంగా ఉన్నంత వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది. వాటిలో చిన్నమార్పు తలెత్తినా.. కణాలు పట్టుతప్పుతాయి. అవి క్యాన్సర్ వ్యాధికి దారితీస్తాయి. మారిన జీవనశైలి, కాలుష్యం, తినే ఆహారంలో మార్పులు, అలవాట్లు, పొరపాట్లు వెరసి… క్యాన్సర్ తీవ్రత ఏటికేడూ పెరుగుతూనే ఉంది. రోగుల సంఖ్యతోపాటు మరణాల రేటు కూడా పెరుగుతున్నది. వైద్యశాస్త్రంలో వెలుగు చూస్తున్న అధునాతన విధానాలు.. క్యాన్సర్ బాధితులకు కొంత ఊరటనిస్తున్నాయి. అలాంటిదే ఎంఆర్ (మాగ్నెటిక్ రిజోనెన్స్) గైడెడ్ రేడియోథెరపీ. ఎలెక్టా యూనిటీ ఎంఆర్ లైనాక్ (LINAC) సిస్టమ్ ద్వారా క్యాన్సర్ రోగులకు మరింత కచ్చితమైన, నాణ్యమైన చికిత్స అందించవచ్చు. ఈ స్వీడన్ సాంకేతికతలో రేడియేషన్ థెరపీ, మాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) కలిసి ఉండటం విశేషం. ఇది క్యాన్సర్ చికిత్సలో మైలురాయి అని చెప్పవచ్చు.
గతేడాది భారతదేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పద్నాలుగు లక్షల పైచిలుకు ఉందని తేలింది. వయోవర్గాల వారీగా చూస్తే 40-64 ఏండ్ల వారికి క్యాన్సర్ల ముప్పు ఎక్కువ. 40 సంవత్సరాలు దాటిన పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్, స్త్రీలలో అయితే అన్ని వయోవర్గాల వారిలో రొమ్ము క్యాన్సర్ తీవ్రత అధికంగా ఉంది. ఐసీఎంఆర్- నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చి ప్రకారం.. 2015 నుంచి 2025 మధ్యకాలంలో అన్ని రకాల క్యాన్సర్ కేసులలో దాదాపు 27.7 శాతం పెరుగుదల నమోదు కావడం హెచ్చరిక లాంటిదే!
క్యాన్సర్ చికిత్సలో విస్తృతంగా వాడుకలో ఉన్న అత్యంత ప్రభావవంతమైన విధానం రేడియేషన్ థెరపీ. ఇందులో క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడానికి, వాటి పెరుగుదలను అరికట్టడానికి.. శక్తిమంతమైన రేడియేషన్‌ను ప్రయోగిస్తారు. దీనివల్ల క్యాన్సర్ కణుతుల పరిసరాల్లో ఉన్న ఆరోగ్యవంతమైన కణాలకు తక్కువ నష్టం వాటిల్లుతుంది. వ్యాధి నివారణ చర్యగానూ, ఉపశమనకారిగానూ.. రెండు విధాలైన పాత్ర పోషించడం రేడియేషన్ చికిత్స ప్రత్యేకత. ఇది రోగులు కోలుకునే రేటును, జీవితంలో నాణ్యతను కూడా పెంచుతుంది. క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ అందించే ప్రయోజనాలు అనేకం.
క్యూరేటివ్ పద్ధతిలో: రేడియేషన్ థెరపీని క్యాన్సర్ చికిత్సలో ప్రాథమిక వైద్యంగా ఉపయోగిస్తారు. ప్రత్యేకించి ఒకే ప్రదేశానికి పరిమితమైన కణుతుల చికిత్సలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. సర్జరీ తర్వాత ఇంకా మిగిలిపోయిన క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడానికి కూడా వాడతారు. కణుతుల పరిమాణం తగ్గించడానికి: సర్జరీకి ముందు కణుతుల పరిమాణం తగ్గించడానికి సైతం రేడియేషన్ థెరపీ ఉపయోగపడుతుంది.
సహాయక చికిత్సగా: సర్జరీ తర్వాత కణితి చుట్టుపక్కల మిగిలిపోయిన క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి సహాయక చికిత్సగా ఈ థెరపీ దోహదం చేస్తుంది. ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి.
ఉపశమనంగా: క్యాన్సర్ ముదిరిపోయిన దశలో ఉన్న రోగులకు నొప్పి, రక్తస్రావం లాంటి లక్షణాలను పోగొట్టడం ద్వారా చికిత్స తర్వాత కూడా ఉపశమనం కలిగిస్తుంది.
తక్కువగా దుష్ప్రభావాలు: రేడియోథెరపీ సాంకేతికతలో జరిగిన అభివృద్ధి వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఆరోగ్యకరమైన కణజాలాన్ని విడిచిపెట్టి, క్యాన్సర్ కణాలే లక్ష్యంగా రేడియేషన్ ఇచ్చే విధానాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి. క్యాన్సర్ కణుతుల చుట్టుపక్కల భాగాలకు తక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి, రుగ్మత లక్షణాలు కనిపించగానే చికిత్సకు వెళ్లాలి. అందులోనూ అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న దవాఖానలకే ప్రాధాన్యం ఇవ్వాలి.
ఎలెక్టా యూనిటీ ఎంఆర్ లైనాక్.. రేడియేషన్ థెరపీలో గొప్ప పురోగతి. హైఫీల్డ్ 1.5 టెస్లా ఎంఆర్ఐ స్కానర్‌ను అధునాతనమైన లీనియర్ యాక్సెలరేటర్-లైనాక్తో జోడించి దీనికి రూపకల్పన చేశారు. ఈ పరికరం క్యాన్సర్ చికిత్స సమయంలోనే ట్యూమర్లను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. కచ్చితమైన రేడియేషన్ థెరపీకి మార్గం సుగమం చేస్తుంది. దీనిద్వారా క్యాన్సర్ కణుతులను గుర్తించి, వాటి పరిసరాల్లో ఉన్న ఆరోగ్యకరమైన కణాలకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా చికిత్స అందించవచ్చు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న క్యాన్సర్ చికిత్సలతో పోలిస్తే.. ఎంఆర్ లైనాక్ రేడియేషన్ థెరపీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరింత కచ్చితత్వం రియల్ టైమ్ ఎంఆర్ఐ ఇమేజింగ్ ద్వారా డాక్టర్లు క్యాన్సర్ కణుతులు, వాటి పరిసరాల్లో ఉండే ఆరోగ్యకరమైన కణజాలాన్ని గుర్తిస్తారు. ఫలితంగా కణితిని మాత్రమే లక్ష్యంగా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పైగా రోగి అవసరాలకు తగినట్టుగా చికిత్సను మార్చుకోవచ్చు.
ఎంఆర్ లైనాక్ ఇమేజింగ్‌లో.. కణితి ఎలా స్పందిస్తుంది, రోగి వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తున్నాయనే సమాచారం కృత్రిమమేధ ద్వారా అందుతుంది. దీనివల్ల డాక్టర్లు తగిన విధానాన్ని ఎంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన కణాల మీద పెద్దగా ప్రభావం పడదు.
ఎంఆర్ లైనాక్ చికిత్సలోని కచ్చితత్వం కారణంగా క్యాన్సర్ కణుతులకు దగ్గర్లోని ఆరోగ్యకరమైన కణాలు రేడియేషన్‌కు
రేడియేషన్ థెరపీతో ముడిపడిన సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి.
ఎంఆర్ లైనాక్లో భాగమైన రియల్ టైం ఇమేజింగ్ సామర్థ్యం కారణంగా కణితికి సురక్షితంగా రేడియేషన్ డోసులను చేరవేయవచ్చు. ఈ విధానం వల్ల వివిధ క్యాన్సర్లకు కచ్చితమైన ప్రయోజనాలు రాబట్టుకోవచ్చు.
ప్రొస్టేట్ క్యాన్సర్: ప్రొస్టేట్ గ్రంథి, దాని పరిసరాలను కచ్చితంగా గుర్తించవచ్చు. దీంతో మరింత సమర్థంగా రేడియేషన్ థెరపీ చేయవచ్చ. కణితి స్థానం, పరిమాణం మొదలైన వాటిని బేరీజు వేసుకుని తిరుగులేని చికిత్స అందించడానికి దోహదపడుతుంది.
స్త్రీల క్యాన్సర్లు : గర్భాశయ ముఖద్వార, మూత్రాశయ, యోనికి సంబంధించిన క్యాన్సర్ల చికిత్సలోనూ ఎంఆర్ లైనాక్ ఇమేజింగ్ కీలకపాత్ర పోషిస్తుంది.
క్లోమగ్రంథి క్యాన్సర్: శ్వాస, జీర్ణక్రియ జరిగే క్రమంలో క్లోమగ్రంథి క్యాన్సర్ కణుతుల్లో చెప్పుకోదగ్గ కదలికలు ఉంటాయి. ఇందులో కూడా ఎంఆర్ లైనాక్ రియల్ టైం ఇమేజింగ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనివల్ల మరణాల ముప్పు తగ్గుతుంది. ఇవే కాకుండా మలద్వార (రెక్టల్) క్యాన్సర్లు, రక్త క్యాన్సర్లు (సర్కోమా), బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో ఎంఆర్ లైనాక్ పాత్ర తిరుగులేనిది. గతంలో అంతర్జాతీయంగా అతికొద్ది నగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్న ఎలెక్టా యూనిటీ ఎంఆర్ లైనాక్ సేవలు.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లోనూ లభిస్తున్నాయి.