Life Jacket : సముద్రాలు, నదుల్లో నౌకలు, పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే నీటిలో మునగకుండా ఉండేందుకు లైఫ్ జాకెట్ (Life Jacket) లు ధరిస్తుంటారు. అవి అంత ఖరీదైనవి ఏమీ కావు. మహా అయితే రూ.500 నుంచి రూ.1000 మధ్య ధర ఉంటుంది. కానీ ఓ లైఫ్ జాకెట్ మాత్రం ఏకంగా రూ.9 కోట్ల (Rs.9 crore) ధర పలికింది. అంత ధర దేనికి..? దాని ప్రత్యేకత ఏమిటి..? అనుకుంటున్నారా..? అది 1912లో జరిగిన ‘టైటానిక్ (Titanic)’ విషాదానికి సంబంధించినదట. ఆ ప్రమాదం నుంచి ఓ మహిళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ లైఫ్ జాకెట్ తోడ్పడిందట.
సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌకకు సంబంధించిన వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ఈ వేలం ద్వారా మరోసారి నిరూపితమైంది. నాటి ప్రమాదం నుంచి ఓ ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిన లైఫ్ జాకెట్ తాజాగా లండన్‌లో జరిగిన వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఫీజులతో కలిపి ఏకంగా రూ.9 కోట్లకు ఓ అజ్ఞాత వ్యక్తి దాన్ని సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ చారిత్రక లైఫ్ జాకెట్ 6,70,000 పౌండ్ల (మన కరెన్సీలో సుమారు రూ.7.50 కోట్లు) ధర పలికింది. ఫీజులు, ఇతర ఛార్జీలతో కలిపి దాని ధర రూ.9 కోట్లకు చేరింది.
ఫోన్ ద్వారా వేలంలో పాల్గొన్న అజ్ఞాత వ్యక్తి దాన్ని కొనుగోలు చేశారు. ఈ లైఫ్ జాకెట్ టైటానిక్‌లో ఫస్ట్ క్లాస్ ప్రయాణికురాలైన లారా మాబెల్ ఫ్రాంకటెల్లికి చెందినది. ఆమె అప్పటి ఫ్యాషన్ డిజైనర్ లూసీ డఫ్ గోర్డాన్ వద్ద సెక్రటరీగా పనిచేసేవారు. 1912లో ప్రమాదం జరిగినప్పుడు ఆమె తన యజమానులతో కలిసి ‘లైఫ్ బోట్ నంబర్ 1’ లో సురక్షితంగా బయటపడ్డారు. క్యాన్వాస్ వస్త్రం, కార్క్ ముక్కలతో తయారైన ఈ జాకెట్ ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం. దీని చారిత్రక విలువను పెంచే మరో ముఖ్య అంశం ఏమిటంటే.. దీనిపై లారాతోపాటు ప్రమాదం నుంచి బయటపడిన మరో ఎనిమిది మంది సంతకాలు కూడా ఉన్నాయి.
ఇది కేవలం ఒక వస్తువుగా కాకుండా ఆనాటి భయానక ఘటనకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. నిజానికి వేలంలో ఈ జాకెట్ 2.5 లక్షల నుంచి 3.5 లక్షల పౌండ్లు పలుకుతుందని నిర్వాహకులు అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో రెట్టింపు ధరకు అమ్ముడుపోయింది. ఇదే వేలంలో టైటానిక్ లైఫ్ బోట్‌కు చెందిన ఓ సీటు కుషన్ కూడా రూ.4.5 కోట్లకు పైగా ధర పలికింది.