లాతూర్, అక్టోబర్ 3: ఈ ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల మహారాష్ట్రలోని లాతూర్లో కరువు, తీవ్ర పశుగ్రాసం కొరత ఏర్పడింది. దీంతో లాతూరు జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా పచ్చికబయళ్లు ఎండిపోతుండగా, పచ్చగడ్డి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో తమ పశువులను రక్షించుకోవడానికి రైతులు పంటలను కోసి పశువులకు పెడుతున్నారు. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం 358 తాలుకాల్లో 265ను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.
కరువు, తీవ్ర వర్షాభావంతో బాధపడుతున్న రైతులకు పంట రుణాల పునర్వ్యవస్థీకరణ, విద్యుత్తు బిల్లుల సబ్సిడీ, ల్యాండ్ రెవెన్యూ మినహాయింపులు వంటిని ప్రభుత్వం కల్పిస్తున్నా అవి వారిని ఏ మాత్రం ఆదుకోలేకపోతున్నాయి. తనకు ఏడెకరాల పొలం ఉందని, అలాగే ఏడు గేదెలు, రెండు ఆవులు, పలు దూడలు ఉన్నాయని, వాటికి చెరకు పంటనే ఆహారంగా పెడుతున్నట్టు కవ్హాకు చెందిన నారాయణ గుడే ఆవేదన వ్యక్తం చేశాడు. అకారణంగా మిగిలిన పంటల దిగుబడి కూడా తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు.