ఇప్పటిదాకా ‘డెస్టినేషన్ వెడ్డింగ్స్’ గురించే విన్నాం. నచ్చిన ప్రదేశాలకు వెళ్లి.. పెళ్లి వేడుకలు నిర్వహించుకోవడం చూశాం. ఇప్పుడు ‘పుట్టినరోజు’ వేడుక కూడా.. అదే తోవలో నడుస్తున్నది. ప్రతిదాన్నీ విభిన్న కోణంలో చూస్తున్న జెన్-జీ.. సరికొత్తగా ‘బర్త్‌డే టూర్’కు శ్రీకారం చుట్టింది. బర్త్‌డే రోజునే బ్యాక్‌ప్యాక్ సర్దేస్తున్నది. ఈ సరికొత్త ట్రెండ్.. పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నది.
పుట్టినరోజు అంటే.. ఫ్యామిలీ-ఫ్రెండ్స్-కేక్ కటింగ్-పార్టీ! ఏండ్లుగా కాస్త అటూ ఇటుగా అందరూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. కానీ, నేటి యువత ‘బర్త్‌డే టూర్’ పేరుతో సరికొత్త ట్రెండ్‌ను పరిచయం చేస్తున్నది. పుట్టినరోజున ఏదో ఒక ప్రదేశాన్ని సందర్శించడం.. ఈ ట్రెండ్ ప్రత్యేకత. ఈ ప్రయాణంలో కొత్త సంస్కృతులను అన్వేషిస్తున్నారు. అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదిస్తున్నారు. ఉత్కంఠభరితమైన అనుభవాలను మూటగట్టుకుంటున్నారు. మొత్తంగా.. పుట్టినరోజును మరింత చిరస్మరణీయంగా మార్చుకుంటున్నారు. ఇక ఈ ‘బర్త్‌డే టూర్’తో అనేక లాభాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడూ రొటీన్ బర్త్‌డే పార్టీలేనా? ఈసారి సరికొత్తగా ప్రయత్నించండి. ఒక అందమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టండి. మీ మామూలు దినచర్య నుంచి ఈ ప్రత్యేక రోజును కాస్త పక్కకు జరపండి. బర్త్‌డేను విభిన్నంగా జరుపుకోవడానికి.. మీ బ్యాక్‌ప్యాక్ సర్దేయండి.
పుట్టినరోజున మీరు చేసే ప్రయాణం.. మీ స్వీయ ఆవిష్కరణకు నాంది పలుకుతుంది. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటానికి, మీ జీవితాన్ని సరికొత్త కోణంలో చూడటానికి ఓ మార్గం అవుతుంది. రాబోయే ఏడాది కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, సరికొత్త నిర్ణయాలను తీసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని అందిస్తుంది.
ఓ కొత్త ప్రదేశంలో, ఉత్తేజకరమైన వాతావరణంలో.. మీకు ప్రియమైనవారితో మీ పుట్టినరోజును గడపండి. ఎన్నో అందమైన జ్ఞాపకాలను మదినిండా నింపుకోండి. మీ బంధాలను మరింత బలోపేతం చేసుకోండి.
ఈ బర్త్‌డేలు.. పార్టీలు పడవంటారా? పుట్టినరోజు నాడు హాయిగా విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నారా? అయినా ఫర్వాలేదు. బర్త్‌డేకు ముందురోజే ఓ టూర్ ప్లాన్ చేయండి. బీచ్‌లో విశ్రాంతి తీసుకోండి. ఫారెస్ట్ ట్రెక్కింగ్ చేసి.. అడవి అందాలను ఆస్వాదిస్తూ గడిపేయండి. మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోండి.