బర్మింగ్‌హామ్ : భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో లక్ష్య 21-13, 21-10తో ప్రపంచ రెండో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)కు షాకిచ్చాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో లక్ష్య 36 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తుచేశాడు. తొలి గేమ్ బ్రేక్ సమయానికి 7-11తో వెనుకబడ్డ అతడు.. ఆ తర్వాత పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకుని క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. మహిళల సింగిల్స్ బరిలో నిలిచిన యువ షట్లర్ మాళవిక బన్సోద్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. బన్సోద్ 16-21, 13-21తో ప్రపంచ మూడో ర్యాంకర్ మయగుచి (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్‌లో రుత్విక-రోహన్ జంట 10-21, 12-21తో ఫెంగ్ యాన్ జి- వీ యాక్సిన్ చేతిలో చిత్తయ్యారు.