లాస్ ఏంజెలెస్ : తమ దేశంలో తిష్ట వేసిన అక్రమ వలసదారులను ఎలాగైనా దేశం నుంచి బహిష్కరించాలని కృత నిశ్చయంతో ఉన్న ట్రంప్ ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారులపై ఫెడరల్ అధికారులు జరిపిన ఆకస్మిక దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా శుక్రవారం నగరమంతా నిరసనలతో హోరెత్తింది. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చేటు చేసుకోవడంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే, ఫ్లాష్ బ్యాంగ్ గ్రనేడ్లను ప్రయోగించారు. నగరంలోని ఫ్యాషన్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఒక వస్త్ర వ్యాపారిపై శుక్రవారం మధ్యాహ్నం ఫెడరల్ అధికారులు ఆకస్మిక దాడి చేసి 44 మంది ఉద్యోగులను నిర్బంధించారు. ఈ వార్త నగరమంతా వ్యాపించడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు.