డిచ్పల్లి, జూలై 8: ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన తెలంగాణ యువకుడు శవమై తేలాడు. గుట్టుచప్పుడు కాకుండా అతడ్ని ఎడారిలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. డిచ్పల్లి మండలం కోరట్‌పల్లి తండాకు చెందిన గుగులోత్ కైలాశ్ (30) బీటెక్ పూర్తి చేసి, ఐదేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అక్కడి సాల్మి ఎడారి ప్రాంతంలో జరుగుతున్న హైవే నిర్మాణ పనుల్లో పాలు పంచుకుంటున్నాడు. అయితే, మార్చి 19న తన తల్లిదండ్రులకు చివరిసారిగా ఫోన్ చేసిన అతడు ఆచూకీ లేకుండా పోయాడు.
ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు కువైట్‌లో తమకు తెలిసిన వారితో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసి, లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎడారి వైపు వెళ్లేటప్పుడు కారులో ఇద్దరు ఉన్నారని, వచ్చేటప్పుడు ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చారని గుర్తించారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజీలో నమోదైన ఆధారాలతో అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం బయటికి వచ్చింది. క్రేన్ ప్రమాదంలో కైలాశ్ మృతి చెందాడని, ఇది తమ మీదకు వస్తుందన్న భయంతో తన తండ్రితో కలిసి అక్కడే ఇసుకలో పాతి పెట్టామని అంగీకరించాడు. దీంతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతడి తండ్రి అప్పటికే కువైట్ విడిచి ఇండియాకు చేరుకున్నాడని గుర్తించారు. వీరిది డిచ్పల్లి మండలం సాంపల్లి తండా పరిధిలోని ఓ ప్రాంతమని కైలాశ్ కుటుంబ సభ్యులకు కువైట్ నుంచి సమాచారమందింది. దీంతో మృతుడి తండ్రి బుధవారం డిచ్పల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, కువైట్‌లో తన కుమారుడు పట్టుబడ్డాడని తెలిసి తండ్రి ఇక్కడి నుంచి కూడా పరారైనట్లు తెలిసింది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.