దుబాయ్: కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లోని బీజేపీ నేతలు ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఆందోళన చేపట్టిన వారిని తిరిగి స్వదేశాలకు పంపించేందుకు కువైట్ సర్కార్ నిర్ణయించింది. గల్ఫ్ దేశాల్లో ఎటువంటి నిరసన ప్రదర్శన చేపట్టరాదు. అట్టి ప్రదర్శనలపై బ్యాన్ ఉంది. అయితే ఫాహహీల్ ఏరియాలో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు నిరసన ప్రదర్శన చేపట్టారు. అందులో విదేశీయులు ఉన్నారని, వారిని స్వదేశానికి పంపనున్నట్లు కువైట్ ప్రభుత్వం తెలిపింది. దేశంలోని చట్టాలను ఆందోళనకారులు ఉల్లంఘించారని, వాళ్లను స్వదేశాలకు పంపనున్నట్లు కువైట్ వెల్లడించింది. నిరసనకారుల్ని డిటెక్టివ్లు గుర్తిస్తున్నారని, వారిని అరెస్టు చేస్తున్నారన్నారు. మళ్లీ కువైట్లో అడుగుపెట్టకుండా ఉండే రీతిలో వారిని బ్యాన్ చేస్తున్నట్లు కువైట్ పత్రిక ఒకటి తెలిపింది. ఇంతకీ ఆ నిరసన ప్రదర్శనలో ఏ దేశంవారు పాల్గొన్నారో తెలియదు.