KTR PRO Mahesh | రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేతలతో పాటు సిబ్బందిపైనా వికృత చేష్టలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేశ్‌పై మరో అక్రమ కేసు నమోదు చేసి.. విచారణ పేరుతో రాతంత్రా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. శుక్రవారం ఉదయం ఆయన్ను విడుదల చేశారు.
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున మూడో నంబర్ గేటు వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో సైఫాబాద్ పోలీసుల విచారణకు హాజరై తిరిగి వెళ్తున్న మహేశ్‌ను స్టేషన్ వద్దే అరెస్టు చేశారు. ఈ నెల 8వ తేదీన కేటీఆర్ ఎర్రవెల్లికి వెళ్తున్న సమయంలో బొల్లారం చెక్‌పోస్ట్ వద్ద ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్.. తనతో దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలగించారని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే గురువారం రాత్రి మహేశ్‌ను అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్దనే మరో కేసుకు సంబంధించి మహేశ్‌ను అదుపులోకి తీసుకుని బొల్లారం పీఎస్‌కు తరలించారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వరకు విచారణ జరిపారు. అనంతరం ఆయన్ను విడుదల చేశారు. కాగా దీనిపై బీఆర్ఎస్ లీగల్ టీమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కాగా, అక్రమ కేసులతో భయపెట్టాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు మరోసారి వీగిపోయాయని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. నిన్నటి నుంచి మహేశ్ ముదిరాజ్, పీఏ మహేందర్ రెడ్డికి అండగా నిలబడి, అలుపెరుగని పోరాటం చేసిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను న్యాయపరంగా దీటుగా ఎదుర్కొని, మహేశ్ ముదిరాజ్ విడుదలలో కీలక పాత్ర పోషించిన బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అక్రమ కేసులకు కేసీఆర్ సైన్యం భయపడదని స్పష్టం చేసింది. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించింది.