హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ)/ములుగు: మూడేండ్ల పాలనలో భూములను దోచుకున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు భూమి లోపల ఉన్న సంపదను కొల్లగొట్టి వారసత్వ కట్టడాలను కూల్చేందుకు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి అతి సమీపంలో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుకు సిద్ధంకావడం దారుణమని సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన ఖండించారు.
ఓ పత్రిక కథనాన్ని తన పోస్ట్‌కు ట్యాగ్ చేసి సర్కార్ వైఖరిని ఎండగట్టారు. ఆలయ సమీపంలో తవ్వకాలు, బ్లాస్టింగ్ చేస్తే శిల్పకళకు ప్రతిరూపమైన, యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, రామప్ప చెరువుకు తీవ్ర ముప్పు వాటిల్లనున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ చర్యలకు బీఆర్ఎస్ వ్యతిరేకమని స్పష్టంచేసిన కేటీఆర్.. రామప్ప ఆలయానికి హానిచేసే ఓసీ బొగ్గు గని ఏర్పాటు ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.