ఖమ్మం, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కడతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మాటమీద తాను నిలబడతారా?’, 20 లక్షల ఇళ్లు కట్టాకే మరోసారి ఓటర్ల గుమ్మం వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతామని పలికిన ప్రగల్భాలకు కట్టుబడి ఉన్నారా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అయితే, ఇప్పటికే రెండున్నరేళ్ల పాలన పూర్తయినందున 10 లక్షల ఇళ్లయినా కట్టారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కడితే ఎక్కడ కట్టారో, ఎప్పుడు కట్టారో చూపించాలని డిమాండ్ చేశారు. ‘అసలు 20 లక్షల ఇళ్లు కట్టిన తర్వాతే ఓట్లడుగుతామన్న మాటకు కట్టుబడి ఉండే దమ్ము ఉందా? ఆ మాట మీద నిలబడతారా?’ అంటూ పొంగులేటికి సవాల్ విసిరారు.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్), బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు అంశాలపై ఏదులాపురం మున్సిపాలిటీ వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అవగాహన సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన రాజ్యమేలుతుందని విమర్శించారు. ఈ ముఠాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకుడిగా ఉన్నాడని, ఖమ్మం జిల్లాలో మంత్రులు సభ్యులుగా ఉండి.. దొరికినదంతా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆతృత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారిందని ఆరోపించారు.

తెలంగాణలో ముష్కరుల పాలనకు చరమగీతం పాడే రోజు త్వరలోనే ఉందని స్పష్టం చేశారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆదాయం రోజురోజుకూ క్షీణిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం రోజురోజుకూ విస్తరిస్తోందని స్పష్టం చేశారు. రూ.వేల కోట్లను అక్రమంగా సంపాదించారని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని, ఆ జాబితాలో ఉన్న వారితో సెటిల్మెంట్లు చేసుకుంటూ రూ.వేల కోట్లకు పడగలెత్తుతున్నారని విమర్శించారు.
రెండేళ్ల క్రితం మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేస్తే ఇప్పటివరకు కేంద్రం గానీ, ఈడీ గానీ వివరాలు వెల్లడించలేదని అన్నారు. దీంతో బీజేపీతో మంత్రి పొంగులేటికి ఉన్న లాలూచీ అందరికీ అర్థమవుతోందని స్పష్టం చేశారు. ఈడీ దాడులు చేసిన సమయంలో పొంగులేటి ఇంటి వద్ద కరెన్సీ కట్టలను లెక్కించలేక యంత్రాలే అలిసిపోయాయని, అదనంగా తేవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల వల్ల ఖమ్మం జిల్లా దివాలా తీసిందే తప్ప అభివృద్ధి ఎక్కడా కానరావడంలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయం కుప్పకూలిపోతున్నా వ్యవసాయ మంత్రి పట్టించుకునే పరిస్థితిలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నా ఆర్థిక మంత్రికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. పైగా, మాత్రం కమీషన్ల జోరుతో ముందుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. పొంగులేటి అవినీతి, అక్రమాలపై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వీడియోలను సభావేదికపై కేటీఆర్ ప్రదర్శిస్తూ మాట్లాడారు. ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడానికి పొంగులేటి వెళ్లి అదానీని ఆశ్రయించారని, కేసు నుంచి బయటపడ్డారని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప వికాసం లేకుండాపోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో ఇంటికి రూ.6 లక్షలు ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు ఇప్పటి వరకూ ఏ ఒక్కరికైనా రూ.6 లక్షలు ఇచ్చారా అని ప్రశ్నించారు. అయినా, నిస్సిగ్గుగా ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. చివరికి, దేవుడి మీద కూడా ఒట్లు వేసి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. రైతుల బాధలను చూసి కేసీఆర్ రద్దు చేసిన భూమి శిస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం బాండు పేపర్లు రాసిచ్చిన భట్టి విక్రమార్క.. వాటిల్లో ఎన్నింటిని అమలుచేశారో, అవి ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిజాయితీగా ఎన్నికలు జరిగితే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ 100 సీట్లు గెలిచి తీరుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అప్పులతో రాష్ర్టాన్ని సుభిక్షంగా ఉంచే సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారని గుర్తుచేశారు. 24 గంటలు కరెంటు ఇచ్చిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్న హామీ మాత్రం నెరవేరలేదని, కానీ, మంత్రి పొంగులేటి చేస్తున్న లూటీ మాత్రం యథేచ్ఛగా జరుగుతోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవగాహనా రాహిత్యం అంతకంతకూ పెరుగుతుందని, హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకున్న ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డేనని, ఆయన అడుగు జాడల్లో నడవడమంటే విధ్వంసాన్ని కోరుకోవడమే అవుతుందని ఎద్దేవా చేశారు. విషాదాన్ని వినోదంగా చూడడం రేవంత్‌రెడ్డికే సాధ్యమైందని దుయ్యబట్టారు. ‘100 రోజుల్లో పాలనను ఎలా చక్కదిద్దుతాం? 100 రోజుల్లో పిల్లలను పుట్టించడం సాధ్యమా?’ అంటూ ప్రశ్నించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు 30 నెలలు కావొస్తున్నా ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ములుగు జిల్లాలో రూ.4 వేల కోట్ల అక్రమ సంపాదనకు మంత్రి పొంగులేటి తెరలేపారని; 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుతున్నారని; సమ్మక్క, సారలక్క టెండర్లను సైతం మంత్రి వదల్లేదని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కేటీఆర్ తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రమిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. బూత్‌ల వారీగా ఓటింగ్ ప్రక్రియపై బీఆర్ఎస్ శ్రేణులు దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓటింగ్ సమీక్ష ప్రక్రియ(ఎస్ఐఆర్)పై కార్యకర్తలు పూర్తిస్థాయి దృష్టి సారించాలన్నారు. బోగస్ ఓట్లను అరికట్టడంపై దృష్టి సారించాలని, అదే సమయంలో అర్హుల ఓట్ల తొలగింపు జరిగే అవకాశం ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరికీ ఓటు ఉండాలన్నది 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నిర్దేశించారని కేటీఆర్ గుర్తుచేశారు. పశ్చిమబెంగాల్లో ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ జరిగిందని, 95 లక్షల ఓట్లు ఆ రాష్ట్రంలో గల్లంతయ్యాయని వివరించారు.
పాలేరు నియోజకవర్గంలోని 291 పోలింగ్ కేంద్రాల్లో ఈసారి బీఆర్ఎస్కు మెజార్టీ రావాలని పిలుపునిచ్చారు. మంత్రి పొంగులేటి పరాజయం నియోజకవర్గ కార్యకర్తల చేతుల్లోనే ఉందని అన్నారు. పార్టీలోని ప్రతీ నాయకుడు, కార్యకర్త తమ సొంత పోలింగ్ కేంద్రంలో మెజార్టీ చూపెట్టాలని, అప్పుడే పార్టీ పటిష్టమవుతుందని అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు డిజిటల్ గుర్తింపు కార్డు ఇస్తామని, దీంతో అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవం లభించే పరిస్థితి ఉంటుందని వివరించారు. పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై శ్రేణులు దృష్టి సారించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏజెంటే కథానాయకుడిగా వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్రంలో దండుపాళ్యం బ్యాచ్‌ను తరిమికొట్టే బాధ్యత పార్టీ కార్యకర్తలదేనని పిలుపునిచ్చారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, డీఎస్ రెడ్యానాయక్, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, పార్టీ నేతలు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, ఇంటూరి శేఖర్, ఉప్పల వెంకటరమణ, బమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
అప్పులంటూ ఆక్రోశిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఈ రెండున్నరేళ్లలో రూ.నాలుగు లక్షల కోట్ల అప్పుచేసిందని కేటీఆర్ స్పష్టం చేశారు. మరి ఈ రూ.4 లక్షల కోట్ల అప్పులతో ఏం అభివృద్ధి చేశారో, ఎవరి కన్నీళ్లు తుడిచారో, ఏ ప్రాజెక్టును కట్టారో చూపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘరానా దొంగ అయితే మంత్రి పొంగులేటి గజదొంగగా మారారని ఆరోపించారు. 60 రోజులపాటు రైతుల ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేని దౌర్భాగ్య ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులూ మోసగాళ్లేనని ధ్వజమెత్తారు. తన భూ అక్రమాలపై కేసు పెట్టిన హబీబుల్లాఖాన్ అనే పోలీసు అధికారిని బదిలీ చేయించిన నీచ చరిత్ర మంత్రి పొంగులేటిదని మండిపడ్డారు. పొంగులేటి.. అధికారులతో అదుపుతప్పి మాట్లాడుతున్నారని, ‘సెన్స్ ఉందా’ అని ప్రశ్నిస్తున్నారని అన్నారు. అయితే, అసలు పొంగులేటికి సెన్స్ ఉంటే అధికారులతో ఎలా వ్యవహరించాలో తెలిసేదని ఎద్దేవా చేశారు.