హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో త్వరలో జరిగే హైదరాబాద్-రంగారెడ్డి-మ హబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ గెలుపు తథ్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు పార్టీకి సానుకూల వాతావరణం ఉ న్నదని చెప్పారు. పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా భవిష్యత్తు ఎన్నికల విజయానికి బాటలు వేయాలని కోరారు. సోమవారం తెలంగాణ భవన్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ నేతతో ఆయన సమావేశమయ్యా రు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. గతంలో ఈ స్థానం నుంచి పార్టీ తరఫున మాజీ ప్రధాని పీవీ కుమార్తె వాణీదేవిని బరిలో నిలిపి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నామని గుర్తుచేశారు. పార్టీ నేతలంతా సమిష్టిగా పనిచేయడంతోనే గెలుపు సాధ్యమైందని పేర్కొన్నారు. ఈసారి కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ నేతలంతా ఆయా జిల్లాల పరిధిలోని పట్టభద్రులు తమ ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ నేతలు తమ కుటుంబ సభ్యులతోపాటు అర్హులైన ప్రతి ఒకరూ ఓటు నమోదయ్యేలా ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు.

అలవికానీ హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీపై యువతరం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ వేగంగా తగ్గుతున్నదని చెప్పారు. యువత ఆ పార్టీకి దూరమైందనే ఆందోళన బీజేపీ అగ్రనేతలను కూడా వెంటాడుతున్నదని స్పష్టంచేశారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత తారస్థాయికి చేరిందని తెలిపారు. రెండు ఢిల్లీ పార్టీలపై ప్రజాక్షేత్రంలో యువతరం రగిలిపోతున్నదని, ఈ తరుణంలో బీఆర్ఎస్ రెండుకు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నదని వెల్లడించారు. రేవంత్ సరార్ చేసిన మోసంపై ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారని, మరోవైపు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా దగా చేసిన ప్రభుత్వంపై నిరుద్యోగులు పీకల దాకా కోపంతో ఉన్నారని గుర్తుచేశారు.
ఇటీవలే వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న ఈ దద్దమ్మ ప్రభుత్వంపై విద్యావంతులు దుమ్మెత్తిపోస్తున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ అకడి ఎమ్మెల్సీ స్థానంలో పార్టీ గెలుపుపై నేతలు ధీమా వ్యక్తంచేశారని గుర్తుచేశారు. పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా పకా ప్రణాళికతో ఓటర్ ఎన్‌రోల్‌మెంట్‌ను సమర్థవంతంగా చేపట్టి పార్టీ గెలుపు కోసం ప్రతిఒకరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అతి విశ్వాసం పనికిరాదని, ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని ఉద్బోధించారు.