హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : బుల్లెట్ ట్రైన్ పేరిట ప్రభుత్వ పెద్దలు భూ దందాకు తెరతీశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన విమర్శలు చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న బహదూర్‌గూడ రైతులతో సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో సమావేశమై వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ‘అధైర్యపడొద్దు.. కేసీఆర్ తిరిగి సీఎం కాగానే మీ నాయకుడు కార్తీక్‌రెడ్డి చేతులమీదుగా పట్టాలిప్పిచ్చే బాధ్యత నాది’ అని భరోసా ఇచ్చారు. ‘మళ్లోసారి మీ భూముల మీదికి వస్తే సెల్‌ఫోన్‌తో ఆ పోలీసోళ్ల ఫొటో కొట్టండి.. కేసీఆర్‌కు పంపిస్తామని చెప్పండి’ అంటూ రైతులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ భవన్‌కు వస్తున్న రైతుల ఫొటోలను పోలీసులు తీయడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘పోలీస్‌స్టేషన్‌లో పెట్టాల్సిన ఫొటోలెవవరివి?. రౌడీషీటర్లు, దొంగలు, తులం బంగారం ఇస్తామని ఆడబిడ్డలను, అత్తకు నాలుగువేలు, కోడలుకు రూ.2,500 అందిస్తామని మహిళలను, ఎకరాకు రూ.15 వేల రైతుబంధు ఇస్తామని రైతులను, జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని నిరుద్యోగులను, దళితబంధు ఎగ్గొట్టి దళితులను మోసం చేసిన వారి ఫొటోలు పెట్టాలి’ అంటూ నిప్పులు చెరిగారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ పట్టాలిస్తామని చెప్పారా? లేదా? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్సోళ్లు కాదా?’ అని నిలదీశారు. గతంలో ఇందిరమ్మ ఇచ్చినట్టే ఇప్పుడు భూములు మళ్లీ ఇస్తామని చెప్పారని, పట్టాలివ్వాల్సిన వ్యక్తి మోసం చేస్తే పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫొటో పెట్టాలా? లేక రైతుల ఫొటోలు పెట్టాలా?’ అని ప్రశ్నించారు. ‘ఒకటి కాదు..రెండు కాదు.. 420 హామీలు, 420 మాటలు చెప్పి గెలిచి గద్దెనెకి ఇవ్వాళ గద్దలెక ప్రవర్తిస్తున్నోడిది పెట్టాలా? మనది పెట్టాలా? వాళ్లవే పెట్టాలె గదా?’ తూర్పారబట్టారు.
భూములు గుంజుకోవద్దని ప్రాధేయపడుతున్న రైతుల భూములపైకి పోలీసులను పంపి దండయా త్ర చేయడం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు. ‘రేవంత్‌రెడ్డీ.. నిజంగా నీకు నీతి, నిజాయితీ ఉంటే.. నీ దగ్గర, ప్రభుత్వం దగ్గర కాగితాలుంటయి. 4 వేల మంది పోలీసులను పంపే అవసరం ఏమున్నది?’ అని నిలదీశారు. ప్రభుత్వం వద్ద భూ పత్రాలుంటే వాటిని రైతులకు చూపించాలని డిమాండ్ చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు బీఆర్ఎస్కు వ్యతిరేకం కా దని స్పష్టంచేశారు. ప్రాజెక్టుల అభివృద్ధికి తాము వ్య తిరేకం కాదని, అభివృద్ధి ముసుగులో రైతుల భూములు గుంజుకొని అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రైతులకు పట్టాలివ్వకపోతే రాళ్లతో కొట్టాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఏమన్నడు? మీకు పట్టాలివ్వకపోతే రాళ్లతో కొట్టుమన్నడు. రేవంత్‌రెడ్డేమో ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టుమన్నడు. రైతుల భూములకు పట్టాలిస్తలేడు.. మరి ఇప్పుడు ఎవర్ని కొట్టాలె? రేవంత్‌రెడ్డినా? ప్రకాశ్గౌడ్నా?’ అని ప్రశ్నించారు.

రైతులకు పట్టాలిప్పించే బాధ్యత తనదేనని బహదూర్‌గూడ రైతులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ‘మీకు పకాగా నేను పార్టీ తరఫున ఇచ్చే మాట.. రెండేండ్ల తర్వాత కేసీఆర్ మీ అందరి దయతోని వస్తడు. మీ పట్టాలు మీకిచ్చి, మీ బహదూర్పల్లిలోనే మీటింగ్‌పెట్టి, ఇదే కార్తీక్‌రెడ్డి ఎమ్మెల్యేగా మీకు పట్టాలిస్తరు’ అని భరోసా ఇచ్చారు. రైతుల తరఫున హైకోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడిన కార్తీక్‌రెడ్డి కృషిని ప్రస్తావించారు. ‘ఏ కార్తీక్‌రెడ్డి అయితే ఇవ్వాళ హైకోర్టుకు పోయి మీకు న్యాయం చేసిండో.. ఇదే నాయకుడి చేతుల మీదుగా మీకు పట్టాలిప్పించే బాధ్యత నాది’ అని భరోసా ఇచ్చారు. బహదూర్‌పల్లి రైతుల భూముల సమస్య పరిషారం కోసం బీఆర్ఎస్ వారి తరఫున నిలబడుతుందని హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలబడుతామని తేల్చిచెప్పారు. రైతులు ధైర్యంగా ఉండాలని, దుర్మార్గపు సర్కార్‌కు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు ఎంత భూమి అవసరమో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనీస స్పష్టత లేదని సబిత విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పట్టాలు సిద్ధమైనా, ఎన్నికల కోడ్ రావడంతో ఇవ్వలేకపోయామని వివరించారు. మరోవైపు గతంలో మెట్రోరైల్ ప్రాజెక్టుకు అనుమతులు వస్తే ఎందుకు అడ్డుకున్నారని రేవంత్ సరార్ను ప్రశ్నించారు. ఓవైపు 200 ఎకరాల్లో సీఎం సోదరులు నిర్మాణాలు చేపడుతున్నారని, అందుకోసమే తమ భూములు లాకుంటున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని ప్రస్తావించారు. రైతుల పక్షాన న్యాయస్థానాల్లోనైనా సరే కొట్లాడుతామని, బాధితులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
బహదూర్‌గూడ భూములు పూర్తిగా ప్రైవేట్ భూములని, వాటిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సరార్ భూములంటూ చిత్రీకరిస్తున్నదని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకడి రైతుల పరిస్థితి చూస్తుంటే ప్యారడైజ్ సినిమా గుర్తుకు వస్తున్నదని చెప్పారు. రైతులను కబ్జాదారులుగా ముద్రిస్తే కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు.
బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి వెయ్యి ఎకరాల భూమి అవసరం లేదని, ప్రాజెక్టు ముసుగులో పేదల భూములను కాజేసి పెద్దలకు కట్టబెట్టేందుకు రేవంత్ సరార్ కుట్ర చేస్తున్నదని కార్తీక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ స్వార్థం కోసం పార్టీలు మారుతూ బహదూర్‌గూడ రైతుల పొట్టకొడుతున్న స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు రైతుల ఉసురు తప్పక తగులుతుందని హెచ్చరించారు. ధైర్యముంటే గతంలో కేసీఆర్, కేటీఆర్, కలెక్టర్‌కు ప్రకాశ్‌గౌడ్ రాసిన లేఖలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. న్యాయపరంగా కోర్టులను ఆశ్రయించడంతో పాటు, రోడ్డెకి అయినా బాధితులకు హకులు దకేవరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం అనే చందంగా పాలిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు బాధితులు బహదూర్‌గూడ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ బహదూర్‌గూడ రైతుల కష్టాలు, సమస్యలు తనకు పూర్తిగా తెలుసని, దివంగత నేత ఇంద్రారెడ్డి కాలం నుంచి తాము, తమ కుటుంబం ఎల్లప్పుడూ రైతులకు అండగానే నిలబడ్డామని గుర్తుచేశారు. రైతులెవరూ ధైర్యం కోల్పోవద్దని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భూసేకరణకు చట్టబద్ధమైన పద్ధతులు ఉంటాయని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం చట్టాన్ని మార్చి అయినా పేదలకు మేలు చేయాలని చూసిందని ఆమె గుర్తుచేశారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన భూములను సైతం అన్యాయంగా లాకుంటున్నదని ధ్వజమెత్తారు. బాధితులు సమావేశానికి వస్తుంటే పోలీసులతో అడ్డుకోవాలని చూడటం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.