సహజ సిద్ధమైన ఉత్పత్తులే ఆరోగ్యకరమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సెలబ్రిటీలు కూడా ఇలాంటి వాటిపై అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. బాలీవుడ్ నటి కృతిసనన్ కూడా కొద్దికాలం నుంచి సహజ సౌందర్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. “నేను ఇంటి చిట్కాలే ఎక్కువగా వాడుతున్నాను. కాకపోతే, వాటికోసం సమయం కేటాయించడమే కష్టం అవుతున్నది. మార్కెట్లో ఏ ఉత్పత్తులు కొనాలన్నా వాటిలో వాడిన పదార్థాలు ఏమిటన్నది గమనిస్తున్నాను. రసాయనాలు కాకుండా అవకాడో, ఉల్లి, గ్రీన్‌టీ మొదలైన పదార్థాలతో తయారుచేసే కేశ సంరక్షణ ఉత్పత్తులనే ఎంచుకొంటున్నా. జట్టు ఆరోగ్యంగా పెరగాలన్నా, చుండ్రులాంటి సమస్యలు తగ్గాలన్నా ఇంటి చిట్కాలు, వంటింటి దినుసులే ఉత్తమం. అదనంగా, ప్రొటీన్లు సమృద్ధంగా ఉన్న ఆహారం తినాలి. రోజువారీగా అవసరమయ్యే విటమిన్లు తీసుకోవాలి. మంచి జీవనశైలి కూడా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది’ అని వివరిస్తున్నది కృతి సనన్.