బంజారాహిల్స్, జనవరి 1: తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోలుగా వెలుగొందిన ఎంతో మంది ప్రముఖులను పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత సీనియర్ నిర్మాత, అలనాటి నటీమణి కృష్ణవేణికే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నా రు. సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి తన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను స్వీయచరిత్రగా ‘కృష్ణవేణి తరంగాలు’ పేరుతో పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆర్.నారాయణమూర్తితో కలిసి శనివారం ఆవిష్కరించారు.
మంత్రి మాట్లాడుతూ, ఒక పందిరి ఎన్నో తీగలకు ఆశ్రయం కల్పించి వాటి ఎదుగుదలకు దోహదం చేస్తుందని, అదే విధంగా కృష్ణవేణి కూడా ఎంతోమందిని సినీ పరిశ్రమకు పరిచయం చేసిందన్నారు. ఆమె పరిచయం చేసిన వారిలో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం సహా అనేక మంది ఉన్నారని తెలిసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రయాణంలోని ప్రతి అడుగుకూ కృష్ణవేణి సాక్ష్యం గా నిలిచారని, 98 ఏండ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉండటంతో పాటు తన స్వీయ చరిత్రను నేటి తరానికి అందించడం చాలా గొప్ప విషయమన్నారు.
ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ, తన నిర్మాణ సంస్థ ద్వారా ఎందరో మహానటులను తయారు చేయడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపిన కృష్ణవేణి సేవలను ప్రభుత్వం సరైన విధంగా గుర్తించాలన్నారు. కృష్ణవేణి లాంటి నటీమణి జన్మించడం అసాధ్యమన్నారు. కార్యక్రమంలో ఆకృతి సుధాకర్, ఎస్వీ రామారావు. అనూరాధాదేవి పాల్గొన్నారు.