దాదాపు వెయ్యేండ్ల వారసత్వం కలిగిన కోట్పాడ్ చీరలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. నాటి వారసత్వాన్ని, వైభవాన్ని కొనసాగిస్తూనే నేటి తరానికి తగ్గట్లుగా మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలను కలిపే కోరాపుట్ ప్రాంతంలో వెయ్యేండ్ల క్రితమే పురుడుపోసుకున్నాయి ఈ చీరలు. కొన్నేండ్లుగా వీటికి ఆదరణ కరువైంది. అయితే, ఆ చేనేత కళ గురించి తెలుసుకున్న నిఫ్ట్ ఢిల్లీ విద్యార్థిని అనుప్రియ ‘కోట్పాడ్ టెక్స్టైల్స్’పై ఓ ప్రాజెక్ట్ చేపట్టింది. చేనేత వారసత్వ కళను బతికించేందుకు నేతన్నలతో కలిసి అడుగేసింది. ఈ తరానికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేయించింది. ఆమె సూచనలతో కొంగొత్తగా రూపొందించిన కోట్పాడ్ చీరలకు ఎగ్జిబిషన్లలో మంచి ఆదరణ లభించింది. సామాజిక మాధ్యమాల్లో అనుప్రియ వాటికి విరివిగా ప్రచారం కల్పించడంతో దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. అమెరికా, కెనడా, సింగపూర్లో ఉన్న భారతీయులు సైతం వీటి కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కోట్పాడ్ చీరల కోసం ఉపయోగించే ఫ్యాబ్రిక్ సేంద్రియ విధానంలో తయారవుతుంది. మ్యాడర్ (మంజిష్ట) చెట్టు వేర్లను ఉడకబెట్టి వచ్చిన రంగులను వీటికి అద్దుతారు. తెలుపు, మట్టిరంగు, ముదురు ఎరుపు రంగుల్లో లభించే ఈ చీరలు మగువల మనసులు దోచుకుంటున్నాయి. ఈ నెల 12, 13 తేదీల్లో హైదరాబాద్లో కోట్పాడ్ చీరల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు.