Jaggayya | | కొంగర జగ్గయ్య ఈ పేరు వినగానే.. ఓ గంభీరమైన కంఠస్వరం అందరికి గుర్తొస్తుంది. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు జగ్గయ్య. దాదాపు 50 సంవత్సరాల పాటు నటనతోనే ఆయన జీవితం మమేకం చేసుకున్నారు. అలాంటి జగ్గయ్యకు హీరోగా తొలి అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ వుంటుంది. ఓ సందర్బంలో ఆయన తన ఫస్ట్ హీరో చాన్స్ గురించి చెప్పుకొచ్చారు..
1947లొ బీఏ పూర్తి చేసుకున్న తరువాత దుగ్గిరాల జిల్లా బోర్డు హైస్కూలులో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడ పనిచేస్తూనే బెజవాడలో నేషనల్ ఆర్ట్ థియేటర్ ద్వారా నాటకాలు వేసేవాడిని. ఇక ఉపాధ్యాయిడిగా రిజైన్ చేసిన తరువాత ఢీల్లీలోని ఆకాశవాణి కేంద్రంలో మూడేళ్ల పాటు అనౌన్సర్‌గా పనిచేసేవాడిని. ఆ సమయంలోనే నాకు పరిచయమైన ప్రముఖ కథా రచయిత త్రిపురనేని గోపీచంద్ పిలుపు మేరకు పేరంటాలు అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం కోసం అడిషన్ ఇచ్చాను.
మేకప్ టెస్టు అనంతరం లేతగా వున్న నేను ఆ చిత్రంలో నటించే కృష్ణవేణికి జోడిగా కరెక్ట్ కాదని చెప్పడంతో మళ్లీ ఢీల్లీకి వెళ్లిపోయాను. మళ్లీ గోపీచంద్ కొన్ని రోజుల తరువాత పిలిచి ప్రియురాలు చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. అదే నా తొలిచిత్రం. ఆ తరువాత మూడు చిత్రాల్లో వరుసగా అవకాశం రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇక ప్రియురాలు సినిమా ఫ్లాప్ కావడం, పాలేరు సినిమా కొన్నిఇబ్బందుల వల్ల విడుదల కాలేదు. ఆ కోవలోనే నేను నటించిన ఆదర్శం సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. వరుసగా మూడు చిత్రాలు అలా కావడంతో ఇబ్బందిపడ్డాను. సంవత్సరం పాటు ఖాళీగా వున్నాను.
ఆ సమయంలోనే హెచ్ఎం రెడ్డి, రోహిణి పిక్చర్స్ పేదల ఆస్తి అనే సినిమాలో నన్ను హీరోగా తీసుకున్నాడు. అది సరిగా ఆడలేదు. ఆతరువాత నేను నటించిన అర్థాంగి, బంగారుపాప చిత్రాల్లో ఒకదానికొకటి సంబంధం లేని వైవిధ్య పాత్రలను పోషించడంతో రెండు సినిమాలను ప్రేక్షకులు బాగా రీసివ్ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి నటుడిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు’ అని చెప్పుకొచ్చారు కొంగర జగ్గయ్య.