సంగారెడ్డి కలెక్టరేట్, మే 25: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో అటవీశాఖ జిల్లా నూతన కార్యాలయ భవనాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై వారివారి స్థాయిలో పెద్దపెద్ద డైలాగులు వల్లించిన ఈ ఇద్దరు మంత్రులు.. సంగారెడ్డి జిల్లా ప్రథమ పౌరుడు, కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు కనీస మర్యాద ఇవ్వడాన్ని మరిచారు.
కార్యాలయం ప్రారంభించిన అనంతరం, భవనంలో ఏర్పాటు చేసిన సోఫాలో ఇద్దరు మంత్రులు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తదితరులు ఆసీనులయ్యారు. అయితే వారి పక్కనే కలెక్టర్ ప్రతీక్‌జైన్ సుమారు 15 నిమిషాల పాటు నిలబడాల్సి వచ్చింది. కనీసం ఒక కుర్చీ కూడా తెప్పించలేనంత బిజీలో అధికారులు ఉన్నారా? మంత్రులు, ప్రజా ప్రతినిధులకైనా ఇది కనిపించలేదా అని అక్కడ ఉన్న వారు అసహనానికి లోనయ్యారు.