కోల్‌కతా : ఐపీఎల్ 19వ సీజన్లో ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్ చేరుకోగా.. నాలుగో బెర్తు కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) బలంగా పోటీపడుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆ జట్టు ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచి రేసులో నిలిచింది. 13 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ పోరులో తొలుత ముంబై 20 ఓవర్లలో 147/8 స్కోరు చేసింది. కార్బిన్ బాష్ (18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్) టాప్ స్కోరర్. ఆరంభంలో ఆ టీమ్ టాపార్డర్ తేలిపోయింది. కామెరాన్ గ్రీన్ (2/23) దెబ్బకు ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (6), నమన్ ధీర్(0)మూడో ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టగా.. రెండు సిక్సర్లతో అలరించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (15) ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు.
రోహిత్‌తో పాటు సూర్యకుమార్ (15)ను సౌరభ్ దూబే (2/34) వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చడంతో ముంబై 41/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో వర్షంతో రావడంతో ఆట ఆగినా.. తిరిగి మొదలైన తర్వాత తిలక్ వర్మ (20), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (26) వేగంగా ఆడలేకపోయారు. చివర్లో విల్ జాక్స్ (14), దీపక్ చహర్ (10)తో కలిసి బాష్ వేగంగా ఆడటంతో ముంబై ఆమాత్రం స్కోరు చేసింది. అనంతరం మనీశ్ పాండే (45), రోమ్‌మన్ పావెల్ (40) మెరపులతో కేకేఆర్ 18.5 ఓవర్లలో 148/6 స్కోరు చేసి గెలిచింది. కార్బిన్ బాష్ (3/30) మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ ఫిన్ అలెన్ (8), కామెరాన్ గ్రీన్ (4) నిరాశ పరిచినా.. రహానె(21), పావెల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు జోడించిన పాండే కోల్‌కతా విజయం ఖాయం చేశాడు. 24న జరిగే తమ ఆఖరి పోరులో ఢిల్లీపై నెగ్గడంతో పాటు రాజస్థాన్, పంజాబ్ తమ ఆఖరి మ్యాచ్‌ల్లో ఓడితేనే కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరుకుంటుంది.
ముంబై: 20 ఓవర్లలో 147/8 (బాష్ 32*, హార్దిక్ 26, గ్రీన్ 2/23);
కోల్‌కతా: 18.5 ఓవర్లలో 148/6 (పాండే 45, పావెల్ 40, బాష్ 3/30 )
