‘క’తో మంచి విజయాన్ని అందుకున్నారు యువహీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఆయన ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నారు. కిరణ్ నటించిన ‘కె-ర్యాంప్’ సినిమా త్వరలో విడుదల కానుంది. మరోవైపు ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు కిరణ్ అబ్బవరం. ఇంకొన్ని సినిమాలు కూడా పైప్ లైన్లో ఉన్నాయి. మొత్తానికి కిరణ్ అబ్బవరం లైనప్ భారీగానే ఉందనాలి.
ఇదిలావుంటే.. తాజాగా కిరణ్ అబ్బవరంకి చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆయన త్వరలో స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో పనిచేయబోతున్నారు. అయితే.. ఈ సినిమా దర్శకుడు సుకుమార్ కాదు. ఆయన శిష్యుడు వీర. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ఈ సినిమా రూపొందనున్నది. అంటే.. ఈ సినిమాకు సుకుమార్ నిర్మాతగా వ్యవహరిస్తారన్నమాట. మంచి మాస్ ఎంటైర్టెనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలు కానున్నట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.