సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అలాంటి గృహాలు నేడు నగరంలో కాలుష్య నిలయాలుగా మారిపోయాయి. అందుకే ఇంటిని ఆనందమయం చేసుకునేందుకు మొక్కలు పెంచాలంటున్నారు. మొక్కలు.. ఆరోగ్యాన్ని అందించే ఆయుధాలు. కాలుష్యాన్ని తరిమేసే రక్షకులు. ఇంటికి అలంకరణే కాదు అందులోని విషవాయువులను బయటకు పంపించి.. స్వచ్ఛమైన గాలిని ప్రసరింపజేసే అద్భుత శక్తులు. నగరంలోని వాహనాల రద్దీతో ఇండ్లన్నీ దుమ్ము, ధూళితో కాలుష్యమయమవుతున్నాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోని కాలుష్యాన్ని తరిమేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మొక్కలు పెంచుకుంటే ఆ కాలుష్యం నుంచి విముక్తి పొందొచ్చని సూచిస్తున్నారు. అలాంటి మొక్కలు పెంచుకొని ్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ఆనందాన్ని రెట్టింపు చేసుకుందాం.
ఈ మొక్కలు మీ రక్షకులు..
అలోవేరా(కలబంద), డ్రాగన్, జడ్‌జడ్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, వెదురు పామ్,స్నేక్ గార్డ్, పీస్లిల్లీస్ తదితర మొక్కలు ఇంటిలోని కాలుష్య కట్టడికి బాగా ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని సులభంగా పెంచుకోవచ్చు. అలోవేరా ప్రస్తుతం చాలా ఇండ్లలో కనిపిచే మొక్క. కేవలం ఆయుర్వేదంపరంగానే కాదు ఇంట్లోని కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చిన్న కుండీలో తక్కువ నీటితో కాస్త వెలుతూరులోను పెరుగుతుంది. గాలిలోని కర్బన ఉద్గారాలను వడపోసి స్వచ్ఛమైన గాలిని ఇంట్లో ప్రసరింపజేసేల ఈ మొక్క ఉపయోగపడుతుంది. అందుకే దీనికి వడపోత మొక్కగా పేరుంది.
వెదురు పామ్ మొక్క :
మిలిగిన అన్ని మొక్కలతో పోల్చితే వెదురు పామ్ మొక్క తక్కువ నీటితోనే సులువుగా, గుబురుగా పెరుగుతుంది. వెలుతురు అవసరం లేదు. ఫార్మాల్దిహైడ్, డ్రైక్లోరోఇథిలిన్, జైలిన్, టోలిన్ వంటి విషవాయువులను గ్రహిస్తుంది. ఇంటికి సరికొత్త అందాన్నిస్తుంది. ఇంటితలుపులు, కిటికీలు, వరండాల్లో పెంచుకోవచ్చు.
స్పైడర్ ప్లాంట్ :
దీనికి మరో పేరు గాలి మొక్క. తక్కువ నీటితోనూ సులువుగా పెరుగుతుంది. నేరుగా సూర్యరశ్మి పడాల్సిన అవసరం లేదు. ఆకులను కోసి వేరొక కుండీలో పెట్టినా బతుకుతుంది. కార్బన్ మోనాక్సైడ్, బెంజిన్ వాయువులను తగ్గిస్తుంది. గోడలకు వేసే రంగులు, డిటర్జెంట్స్ నుంచి వచ్చే విపరీతమైన వాసనను గ్రహిస్తుంది. గదిలో ఓ మూల, కార్యాలయాల ఆవరణల్లో పెంచుకోవచ్చు.
స్నేక్ గార్డ్ :
మరో మొక్క స్నేక్ గార్డ్ ఆకులు పాము ఆకారంలో ఉంటాయి. ఇవి మూడు రకాలు. ఇవి కూడా ఫార్మాల్దిహైడ్, ట్రైక్లోరో ఇథిలిన్, లోబిన్, బెంజిన్ను గ్రహించి స్వచ్ఛమైన గాలినిస్తుంది. పీస్లిల్లీస్ మొక్క కూడా రాత్రివేళల్లో కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సీజన్‌ను అందిస్తుంది. నేరుగా ఆక్సీజన్ ఇచ్చే మొక్క ఇది.
డ్రాగన్ మొక్క:
ఇది 12 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. వెలుతురు అవసరం లేకుండానే ఎదుగుతుంది. కార్యాలయాలు, ఇండ్లలో పెంచుకునేందుకు సులువుగా ఉంటుంది. ఎండిపోకుండా నీరు ఎప్పటికప్పుడు పోస్తూ ఉండాలి. గది ఉష్ణోగ్రతలతో 12 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. పెయింట్స్, డిటర్జెంట్స్, వార్మిష్ల నుంచి వచ్చే ఘాటు వాసనలను గ్రహిస్తుంది. వంట గదిలో నూనెలు కాలినప్పుడు వేపుళ్లు వేస్తున్నప్పుడు వచ్చే ఘాటు పొగలను తీసుకుంటుంది. వంటగదికి దగ్గరగా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జడ్‌జడ్ ప్లాంట్:
కూడా ఇంటిలోని కాలుష్యాన్ని కట్టడి చేస్తుంది. ఇది ముదురు ఆకుపచ్చ రంగు ఆకులతో ఆకట్టుకునేలా ఉంటుంది. తక్కువ వెలుతురు, ఎత్తులో ఎక్కువ కాలం పెరుగుతుంది. ఇది గాలి కాలుష్యాన్ని దీనిని గదిలో వెలుతురు రాని ప్రదేశాల్లోనూ పెంచుకోవచ్చు.
ఆహ్లాదం.. ఆరోగ్యం
ఆక్సీజన్ అందించే మొక్కలకు చాలా డిమాండ్ ఉంది. చాలా మంది వాటికొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రమాదకర అమ్మోనియా, బెంజిన్, ట్రైక్లోరో ఇథిలిన్ వంటి వాయువులను గ్రహించే మొక్కలు ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. వీటిని. ఇంటిలో ఏ మూలనైనా ఉంచవచ్చు. ఇండ్లల్లో మనకు తెలియకుండానే విష వాయువులు ఉంటాయి. ప్లాస్టిక్ నుంచి కొన్ని వాయువులు వెలువడుతుంటాయి. వీటిని పెంచుకుంటే ఆహ్లాదకర వాతావరణంతో పాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి
– ఫాతిమా, నర్సరీ నిపుణులు
నగర వాసులు పెంచుకోవాలి
మనకు తెలియకుండానే మనం విష వాయువులను పీలుస్తున్నాం. అవి మనల్నీ హాస్పిటల్స్ పాలుజేస్తాయి. అందుకే ఇంట్లో ఔషధ మొక్కలు పెంచుకుంటే విష వాయువులను శుభ్రం చేస్తాయి. స్వచ్ఛమైన ఆక్సీజన్‌ను అందిస్తాయి. ఈ మొక్కల పెంపకం నగరాల్లో ఉండే వారికి మరింత అవసరం.
-యూసుఫ్, నర్సరీ నిపుణులు