హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఖాయమైంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను హైకోర్టు అనర్హుడిగా ప్రకటించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్టు హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర శాసనసభ కార్యదర్శికి కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉభయ రాష్ర్టాల చరిత్రలో ఈ విధంగా అనర్హత వేటు పడ్డ తొలి ఎమ్మెల్యేగా దానం నాగేందర్ నిలిచారు.
కులం తప్పుగా పేర్కొన్నారని, విప్ ఉల్లంఘించారని వంటి కారణాలతో గతంలో కొందరిపై అనర్హత వేటు పడినప్పటికీ పార్టీ మారిన కారణంగా అనర్హతకు గురైంది మాత్రం దానం నాగేందరే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాలకు, న్యాయస్థానాలకు దానం నాగేందర్ కేసు ఒక మార్గదర్శకంగా నిలవనున్నది. గడిచిన మూడేండ్లలో రాష్ట్రంలో రెండు శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగగా ఇప్పుడు మూడో స్థానానికి ఉపఎన్నిక జరుగనున్నది. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎన్నడూ ఇంత తక్కువ వ్యవధిలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఈ తరహాలో ఎన్నికలు జరుగలేదు.
హైకోర్టు తీర్పు ఎన్నికల సంఘానికి చేరిన తరువాత ఖైరతాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక తేదీపై నిర్ణయం తీసుకుంటారు. అక్టోబర్ ఆరో తేదీన తమిళనాడు, బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలలో ఖాళీ అయిన పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆ తరువాత ఐదు రాష్ర్టాలు.. పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్ర శాసనసభల ఎన్నికలు 2027 ఫిబ్రవరిలోపు జరుగనున్నాయి. ఖైరతాబాద్ శాసనసభ ఉప ఎన్నిక కూడా వాటితోపాటే నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
దానం నాగేందర్‌కు ఉప ఎన్నికలు కలిసి రావన్న సెంటిమెంట్ ఉన్నది. ఆయన గతంలో 2004లో ఆసిఫ్‌నగర్ నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కకోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. టీడీపీలో ఇమడలేకపోయిన దానం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్‌పై మళ్లీ అసిఫ్‌నగర్ స్థానం నుంచి పోటీచేయగా, ఓటర్లు తిరస్కరించారు.
తాజాగా మరో ఉప ఎన్నికకు దానం సిద్ధమవుతున్నారు. ఇప్పుడు కూడా అదే ఫలితం పునరావృతం కావచ్చే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ మళ్లీ పోటీచేస్తారా? ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్టు వస్తుందా అన్నది అనుమానమేనని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఈ స్థానం నుంచి దానం నాగేందర్‌ను తప్పించి తన ప్రధాన అనుచరుడు రోహిన్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగుతున్నాడని ప్రచారం జరుగుతున్నది.