తిరువనంతపురం: కేరళ మత్స్య శాఖ మంత్రి సాజి చెరియన్ భారతీయ రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడారు. వీలైనంత మంది సాధారణ జనాన్ని దోచుకునే రీతిలో రాజ్యాంగం రాసి ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ సీరియస్ అయ్యారు. మంత్రి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సీఎం విజయన్ను కోరారు.
ఆ తర్వాత అసెంబ్లీలో మంత్రి చెరియన్ మాట్లాడుతూ.. తానేమీ రాజ్యాంగాన్ని దూషించలేదని, కానీ పరిపాలనా వ్యవస్థ సరిగా లేదని పేర్కొన్నట్లు తెలిపారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి సాజి చెరియన్ క్షమాపణలు కూడా తెలిపారు. అయితే చెరియన్పై చర్యలు తీసుకోకుంటే తాము కోర్టుకు వెళ్లనున్నట్లు ఆ రాష్ట్ర విపక్షాలు పేర్కొన్నాయి.
ఇవాళ ప్రతిపక్షాలు అసెంబ్లీ ఆవరణలో మంత్రి చెరియన్కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టాయి. సభలో విపక్షాలు నినాదాలు చేయడంతో.. అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. మరోవైపు మంత్రి చెరియన్ వ్యాఖ్యలపై కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదంపై విజయన్ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.