
సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): నాలుగున్నర కోట్ల ప్రజల ఆశీర్వాదం ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉందని టీఆర్ఎస్ గ్రేటర్ మాజీ అధ్యక్షడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యాలను ఖండిస్తూ గురువారం సికింద్రాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, వారి భాషను చూసి ప్రజలు విస్తుపోతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం నాటి ఉద్యమ సారధి, సీం కేసీఆర్ ముందుకుసాగుతున్నారని వివరించారు. బీజేపీ అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. వారు మాట్లాడే చెత్త మాటలను తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. బీజేపీ అధ్యక్షుడికి రాష్ట్రంపై అవగాహన లేకుండా మాట్లాడి తన పరువు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని మసులుకోవాలని హెచ్చరించారు.