
బండ్లగూడ, నవంబర్ 14: కస్తూర్బా ట్రస్టు నిర్వాహకులు మానవత్వాన్ని చాటుకున్నారు. భర్త జైలుకెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న గర్భిణిని అమ్మలా ఆదరించి.. బాగోగులు చూసి.. కాన్పు చేయించి.. వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. సిక్కిం రాష్ర్టానికి చెందిన భీమ్రాణి శుభ నేపాల్‌కు చందిన వినోద్ ప్రేమ వివాహం చేసుకున్నారు. నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముంటూ.. చిరు వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. వినోద్ ఓ కేసులో జైలుకు వెళ్లగా, భీమ్రాణి శుభ దిక్కుతోచని స్థితిలో పడిపోవడంతో పోలీసులు కస్తూర్బా గాంధీ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న స్వధార్గ్రూప్ వారికి సమాచారం అందించారు. వారి సహకారంతో ఆమెను ఆగస్టు 18న ‘కస్తూర్బా’ ట్రస్టులో చేర్పించారు.
అప్పటికే భీమ్రాణికి ముగ్గురు పిల్లలు ఉండగా, 8 నెలల గర్భవతి కూడా. మానసిక స్థితి బాగలేకపోవడంతో ట్రస్టు నిర్వాహకులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. స్థానిక గోల్కొండ ఆస్పత్రిలో పురుడుపోయగా, భీమ్రాణి మరో పాపకు జన్మనిచ్చింది. అనంతరం ట్రస్టు ఇన్చార్జి పద్మవతి, జిల్లా సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి సహకారంతో సిక్కిం ఉమెన్ కమిషన్‌తో చర్చించి.. భీమ్రాణి శుభ కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకుని వారికి సమాచారమిచ్చారు. సిక్కిం ఉమెన్ కమిషన్ సమక్షంలో జిల్లా సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, ట్రస్టు నిర్వాహకులు పద్మవతి, మేనేజర్లు శ్రీనివాస్, మూర్తి తదితరుల ఆధ్వర్యంలో ఆదివారం ఆమె సోదరికి అప్పగించారు. ఈ సందర్భంగా వారు కస్తూర్బా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.