Karthika Deepam | తెలుగు బుల్లితెర చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన కార్తీకదీపం సీరియల్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. రెండో సీజన్‌గా ప్రసారమవుతున్న ‘కార్తీకదీపం: ఇది నవ వసంతం’ ఈ శనివారం (ఫిబ్రవరి 21, 2026)తో విజయవంతంగా 600 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రసార సంస్థ స్టార్ మా తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారిక ప్రకటన చేస్తూ ప్రత్యేక పోస్టర్, ప్రోమోను విడుదల చేసింది. మన మనసుల్లో చెరగని ముద్ర వేసిన కార్తీకదీపం 600 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు” అంటూ స్టార్ మా పోస్ట్ చేసింది. మరో ప్రోమోలో “600 ఎపిసోడ్స్, చిరస్మరణీయమైన ప్రేమ.. ఈ అందమైన ప్రయాణానికి తోడైన అభిమానులందరికీ కృతజ్ఞతలు” అంటూ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపింది.
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ను ఓటీటీ వేదిక జియో హాట్ స్టార్ లో కూడా వీక్షించవచ్చు. కార్తీకదీపం తొలి సీజన్ 1500కు పైగా ఎపిసోడ్లతో తెలుగు టెలివిజన్ చరిత్రలో రికార్డు సృష్టించింది. వంటలక్క (దీప) – డాక్టర్ బాబు (కార్తీక్) జంట ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. ఆ జోడీని మళ్లీ తెరపై చూడాలనుకున్న అభిమానుల కోరికకు అనుగుణంగా రూపొందిన ‘ఇది నవ వసంతం’ కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఈ సీరియల్ స్టార్ మాలో టాప్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. కుటుంబ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
600వ ఎపిసోడ్ కథలో కీలక మలుపుగా నిలిచింది. సుమిత్ర అసలు కూతురు జ్యోత్స్న కాదు, దీప అనే నిజం దశరథకు తెలిసిపోవడం కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. పారిజాతం చేసిన పసిబిడ్డల మార్పిడి గుట్టు రట్టవడంతో కుటుంబ సంబంధాలు కుదేలయ్యాయి. తల్లి సుమిత్ర ప్రాణాలను కాపాడటానికి దీప తన గర్భంలోని బిడ్డను పణంగా పెట్టే క్లిష్ట పరిస్థితుల్లో పడింది. మరోవైపు జ్యోత్స్న చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు కార్తీక్ ముందుకు రావడం కథను భావోద్వేగ పరాకాష్టకు తీసుకెళ్తోంది. ఈ సీరియల్లో డాక్టర్ బాబు పాత్రలో నిరుపం పరిటాల, వంటలక్క (దీప)గా ప్రేమి విశ్వనాథం , జ్యోత్స్నగా ప్రియాంక, దశరథగా సుభాష్, పారిజాతం పాత్రలో సుమిత్ర నటిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమి విశ్వనాథ్ మళ్లీ దీప పాత్రలోకి రావడం ఈ సీజన్ విజయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఆమె భావోద్వేగ నటనకు కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి సీజన్లో మోనిత పాత్ర ఎంతటి విలనీని పండించిందో, ఈ సీజన్లో జ్యోత్స్న పాత్ర అదే స్థాయిలో ప్రతికూల ఛాయలను తెరపై ఆవిష్కరిస్తోంది.
600 ఎపిసోడ్స్, చిరస్మరణీయమైన ప్రేమ 💖
మన మనసుల్లో నిలిచిన #KarthikaDeepam టీమ్‌కి శుభాకాంక్షలు ✨
ఈ అందమైన ప్రయాణానికి తోడైన అభిమానులందరికీ ధన్యవాదాలు 🌸#600EpisodesOfKarthikadeepamWatch #KarthikaDeepam Mon to Sat at 8 PM only on #StarMaa pic.twitter.com/Z3nsfmiB1T
— Starmaa (@StarMaa) February 21, 2026