Karimnagar | కరీంనగర్ పట్టణంలో మరోసారి దోపిడీ కలకలం రేపింది. పీఎంజే జ్యువెల్లరీ షాపులో దోపిడీ ఘటన జరిగిన రెండు నెలలు గడవకముందే, అదే తరహాలో మరో ఇంట్లో దోపిడీ జరిగింది. భగత్ నగర్‌కు చెందిన అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి అర్ధరాత్రి 12 గంటల తర్వాత చొరబడిన దుండగులు.. 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు, 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు.
అజ్మత్ అలీ కుటుంబం భగత్ సింగ్ చౌరస్తాలోని ఓ ఇంట్లో మొదటి అంతస్తులో నివాసం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు అజ్మత్ అలీ గ్రౌండ్ ఫ్లోర్‌లోని లైట్ ఆఫ్ చేసి లోపలికి వెళ్తుండగా.. బయట మాటువేసిన ఎనిమిది మంది దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. అరవకుండా నోరు మూసేసి, బలవంతంగా ఇంట్లోకి వెళ్లారు. అనంతరం తల, ముఖంపై గట్టిగా కొట్టారు. ఇంట్లో ఉన్న అతని భార్య, ఇద్దరు కుమార్తెలను సైతం తీవ్రంగా కొట్టారు. అరిస్తే చంపేస్తామని తుపాకులు, కత్తులతో బెదిరించారు.
బాధితులను తీవ్రంగా కొట్టి, అనంతరం వారిని కట్టేసి ఇంట్లో నుంచి 66 తులాల బంగారం, రూ.21లక్షల నగదు, 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు. దోపిడీ అనంతరం వారు ఎవరికీ ఫోన్ చేయకుండా ఉండేదుకు వారి మొబైల్స్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. వెళ్లే ముందు వారందర్నీ ఒక గదిలో బంధించి, పార్కింగ్‌లో ఉన్న రెండు బైక్‌లను చోరీ చేసి వాటిపై వెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, వేములవాడ బైపాస్ మీద నుంచి నిందితులు పరారైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, తెలిసిన వ్యక్తులే దోపిడీకి పాల్పడి ఉంటారని అజ్మత్ అలీ ఆరోపిస్తున్నాడు. పెద్ద అల్లుడిపైనే అనుమానం వ్యక్తం చేశాడు. ఇంటికి వచ్చిన 8 మంది దుండుగులు ఉత్తరాది హిందీ మాట్లాడారని తెలిపాడు. తన అల్లుడు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వాడని చెప్పాడు.
కరీంనగర్ జిల్లాలో అర్థరాత్రి దోపిడి కలకలం
భగత్‌నగర్‌లో భగత్‌సింగ్ విగ్రహం సమీపంలో స్థానికంగా నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి అర్థరాత్రి 12 గంటల తర్వాత చొరబడి దోపిడీకి పాల్పడ్డ సుమారు ఎనిమిది మంది గుర్తు తెలియని దుండగులు
అజ్మత్ అలీ ఇంటి బయట లైట్ ఆఫ్ చేసి లోపలికి… pic.twitter.com/8eEn2WIoei
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2026